Homeహైదరాబాద్#Thief #Theft #Robbery : దొంగ‌నే దోచుకున్నారు

#Thief #Theft #Robbery : దొంగ‌నే దోచుకున్నారు

దొంగతనాలే అతడి వృత్తి.. అక్కడా.. ఇక్కడా అని కాదు.. ఎక్కడైనా సరే తనకు అనుకూలంగా ఉంటే క్షణాల్లో దోచేస్తాడు.

దోచేసిన సొమ్ముతో జల్సాలు చేస్తాడు. ఒకటి కాదు రెండు కాదు అనేక కేసుల్లో ప్రధాన నేరస్తుడిగా ఉన్న ఓ గజదొంగ పోలీసులకు చిక్కాడు.

విచారించగా.. ఆ దొంగ కొట్టేసిన సొత్తును.. ఇతర వ్యక్తులు దోచుకున్నట్లు తేలింది.

ఈ సంఘటనలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సొత్తును రికవరీ చేశారు.

జీడిమెట్ల సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధి షాపూర్‌నగర్‌లో ఈ నెల 9న రాత్రి మిఠాయి దుకాణంలో చోరీ జరిగింది.

కౌంటర్‌లో ఉన్న రూ.4.90 లక్షల నగదు చోరీకి గురైంది.

అయితే ఈ నెల 20న షాపూర్‌నగర్‌ సాగర్‌హోటల్‌ వద్ద ఓ నిందితుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా గమనించిన పెట్రోలింగ్‌ పోలీసులు పట్టుకొని స్థానిక పీఎస్‌కు తరలించారు.

ఇతడు ఎల్‌బీనగర్‌లోని సరూర్‌నగర్‌ చెరువు సమీపానికి చెందిన రమావత్‌ సైదులు(20)గా గుర్తించారు.

ఎల్‌బీనగర్‌, జీడిమెట్ల, సంతోష్‌నగర్‌, మియాపూర్‌, వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు తేల్చారు.

అయితే షాపూర్‌నగర్‌లోని మిఠాయి దుకాణంలో చోరీ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

కొట్టేసిన సొమ్ము దోచేశారు..

షాపూర్‌నగర్‌లో దొంగిలించిన డబ్బుతో ఈ నెల 10న మిర్యాలగూడకు పారిపోయేందుకు ప్రయత్నించాడు.

అదే రోజు వనస్థలిపురం పీఎస్‌ పరిధిలోని హస్తినాపురం వద్ద ఉన్న వైన్‌ షాప్‌ వద్దకు చేరుకున్నాడు.

అక్కడ బైక్‌ను దొంగిలించే క్రమంలో మరో ఐదుగురు నేరస్తులు సైదులును గుర్తించారు.

పట్టుకుని పూర్తిగా తనిఖీ చేసి అతడి వద్ద ఉన్న కొట్టేసిన సొమ్మును దోచుకుని పరారయ్యారు.

రంగంలోకి ప్రత్యేక టీం

నిందితుడు చెప్పిన విషయంపై బాలానగర్‌ డీసీపీ పద్మజా, సైబరాబాద్‌ క్రైం విభాగం డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్‌, ఏసీపీ పురుశోత్తం, జీడిమెట్ల సీఐ బాలరాజు, మాదాపూర్‌ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసన్నకుమార్‌ల నేతృత్వంలో నేరస్తులను పట్టుకునేందుకు టీంగా ఏర్పడ్డారు.

హస్తినాపురంకు చెందిన గడిగా సురేశ్‌(24), మలక్‌పేట్‌కు చెందిన పాండుల పవన్‌(28), దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన కుర్రా లవన్‌కుమార్‌(31), ఓల్డ్‌ మలక్‌పేటకు చెందిన నొములా శివ(28), సరూర్‌నగర్‌కు చెందిన ఆపుల రవి(28)లుగా గుర్తించి పట్టుకున్నారు.

ఐదుగురు పంచుకున్నారు..

షాపూర్‌నగర్‌లో కొట్టేసిన నగదును.. హస్తినాపురంలో దోచుకున్న ఐదుగురు నేరస్తులు పంచుకున్నారు.

పోలీసులు రూ.4.83లక్షల నగదు, మూడు ద్విచక్రవాహనాలు, 4 మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులు పోలీసు బృందాన్ని అభినందించారు.

Recent

- Advertisment -spot_img