Homeహైదరాబాద్latest Newsశ్రీ చైతన్య విద్యాసంస్థల ధన దాహం.. ఎలాంటి అనుమతులు లేకుండానే  నూతన బ్రాంచీల ఏర్పాటు..!

శ్రీ చైతన్య విద్యాసంస్థల ధన దాహం.. ఎలాంటి అనుమతులు లేకుండానే  నూతన బ్రాంచీల ఏర్పాటు..!

  • ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూళ్ళు..!
  • పట్టించుకోని శేరిలింగంపల్లి మండల విద్యాశాఖ అధికారులు.!
  • ప్రమాదంలో వందల మంది విద్యార్థుల భవితవ్యం..!

ఇదే నిజం, శేరిలింగంపల్లి: శ్రీచైతన్య విద్యాసంస్థల ధనదాహానికి అడ్డూ అదుపు లేకుండాపోతుంది.  శేరిలింగంపల్లి నియోజకవర్గంలో  గల్లీకో బ్రాంచి ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థి  నుంచి రూ.లక్షలు వసూలు చేస్తోంది .ముఖ్యంగా ఈ సారి పదుల సంఖ్యలో నూతన బ్రాంచిలని ఏర్పాటు చేయగా వాటిలో ఏ ఒక్క బ్రాంచికి అనుమతులు తీసుకున్న దాఖలాలు లేవు.  అనుమతులు లేకపోయినప్పటికీ  అడ్డగోలుగా  విద్యార్థుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నప్పటికి విద్యాశాఖ అధికారులు తీరుపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క శేరిలింగంపల్లి మండల పరిధిలోనే ఈ విద్యాసంవత్సరం సుమారు 20 వరకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు నూతన బ్రాంచిలు ఎలాంటి అనుమతులు లేకుండానే  ఏర్పాటు చేశారంటే వారి కాసుల దందాఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది.

నిబంధనలకు అడగడుగునా తూట్లు..
శేరిలింగంపల్లి మండల పరిధిలో శ్రీ చైతన్య బ్రాంచీలు ఇప్పటికే పదుల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో నర్సరీ నుంచి పదోతరగతి వరకు ఉన్నాయి.అయితే  ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా మంజీరా రోడ్డు చందానగర్ లో , మియాపూర్ లోని  జేపీ నగర్, మక్త మహబూబ్ పేట్ తదితర చోట్ల నూతనంగా బ్రాంచి లను ఏర్పాటు చేసింది. వీటి ఏర్పాటులో  ఎన్నో మతలబులు దాగి ఉన్నాయి. ఒక్కో బ్రాంచి  నూతనంగా ఏర్పాటు చేయాలంటే బ్రాంచికి , బ్రాంచీకి  మధ్య కనీసం  అర కిలో మీటరు దూరం ఉండాలి. అందుకు విరుద్ధంగా అరకిలో  మీటర్ లోపలే  ఒకే గల్లిలో3 స్కూళ్ళను ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే ఈ స్కూళ్ళ ఏర్పాటుకు ముందే వీటి పక్కన పదుల సంఖ్యలో స్కూళ్లు ఉన్నాయి . ఒకవేళ చైతన్య విద్య సంస్థలు నూతన బ్రాంచి ఏర్పాటు చేయాల్సి వస్తే పక్క స్కూల్ యాజమాన్యం నుంచి నిరభ్యంతర పత్రం ఉంటేనే విద్యాశాఖ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎవ్వరినీ సంప్రదించకుండానే ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా నూతన  బ్రాంచి లను  ఏర్పాటు చేయడం విచిత్రం. పైగా వీరిదెబ్బకు  ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిన స్కూళ్ళు సైతం మూతపడే పరిస్థితి దాపురించింది. ఇలాబరి తెగించడం వెనక ఇటు రాజకీయ పలుకుబడితో పాటు విద్యాశాఖ అధికారుల అండదండలు పూర్తిగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు.

రెసిడెన్షియల్ బిల్డింగ్ లోనే  కమర్షియల్ కార్యకలాపాలు.
మంజీరరోడ్డులో ఆరోహన్ స్కూల్ ఎదురుగా ఏర్పాటు చేసిన చైతన్య విద్యా సంస్థల బ్రాంచీది మరోస్టోరి.ఈ బిల్డింగ్ పూర్తిగా  సెల్లార్ తో పాటు స్టీల్ ప్లస్ 4 అంతస్తులు పూర్తిగా నిభందనలకు విరుద్ధంగా నిర్మించినదే. జీహెచ్ఎంసీ నుంచి ఎన్ఓసీ తీసుకోకుండానే కమర్షియల్ కార్యకలాపాలు చేయడం గమనార్హం. పైగా  ఒక వెైపు  నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నా మరోవైపు స్కూల్ ను నడుపుతున్నారు. ఇలా శ్రీ చైతన్య విద్యా సంస్థల ధన దాహానికి అడ్డే లేకుండా పోయింది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే తెలిసో తెలియకో తల్లిదండ్రులు చేసిన తప్పుకి విద్యార్థులు బలైపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

పాఠశాల విద్యాశాఖకు నివేదిక అందజేస్తాం.
ఇటీవల అనుమతి లేకుండానే చాలా స్కూళ్ళు నడుస్తున్నట్లు మాదృష్టికి వచ్చింది. తప్పకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలించి శ్రీ చైతన్య విద్యా సంస్థలతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూళ్లను గుర్తించి పాఠశాల విద్యాశాఖకు నివేదిక అందజేస్తాం. తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. తల్లి దండ్రులు తమ పిల్లల్ని స్కూల్లో చేర్పించే ముందు అన్ని విషయాలు క్షుణ్ణంగా  తెలుసుకొని చేర్పించాలని సూచించారు- శేరిలింగంపల్లి మండల విద్యాశాఖ అధికారి యస్. వెంకటయ్య.

Recent

- Advertisment -spot_img