– వ్యక్తి అరెస్ట్
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ , యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామని ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మంగళవారం బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకొన్నాడు. ఈ నాయకుల హత్యకు పథకం వేయాల్సిందిగా గ్యాంగ్ తనను కోరిందని పేర్కొన్నాడు. అదే సమయంలో ముంబయిలోని జేజే ఆస్పత్రిని కూడా పేల్చేస్తానని హెచ్చరించాడు. ఈ కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి ఇంటరాగేషన్ చేస్తున్నారు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధాని మోడీకి ప్రాణహాని తలపెడతామని బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల క్రికెట్ ప్రపంచకప్ సమయంలో కూడా ప్రధానిని హత్య చేస్తామని.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియంను పేల్చివేస్తామని ముంబయి పోలీసులకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అంతేకాదు.. సదరు దుండగుడు రూ. 500 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అప్పటికే దాడికి తమ మనుషులు రంగంలోకి దిగారని బెదిరించాడు. వీటిపై దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ సదరు మెయిల్స్ ఐరోపా నుంచి వచ్చినట్లు గుర్తించింది. ఇక ఈ ఏడాది ఆగస్టులో కేరళ పర్యటన సందర్భంగా ప్రధానిపై ఆత్మాహుతి దాడి చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. తన పొరుగింటి వ్యక్తిని, తన మిత్రుడిని కేసులో ఇరికించడానికే అతడు ఇలా చేసినట్లు తర్వాత గుర్తించారు.