Homeహైదరాబాద్latest NewsCongress​ మెడకు ‘మూడు గంటలు’

Congress​ మెడకు ‘మూడు గంటలు’

– రేవంత్ స్టేట్​మెంట్​ బూమరాంగ్​
– ఎన్నికల అజెండాగా మారిపోయిన విద్యుత్​ అంశం
– డీకే ప్రకటనతో మరింత గందరగోళం
– తలపట్టుకుంటున్న హస్తం పార్టీ
– రైతు బంధు దుబారా అంటూ ఉత్తమ్​ స్టేట్​ మెంట్​
– బీఆర్ఎస్​కు అస్త్రాలు అందించిన హస్తం లీడర్లు
– ప్రతి సభలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్న కేసీఆర్​
– కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్​ గోల్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రేవంత్​ రెడ్డి కొన్ని రోజులు క్రితం అమెరికాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్​ పార్టీ మెడకు చుట్టుకున్నాయి. రేవంత్​ ఏ సందర్భంలో అన్నారు.. ఏ సమయంలో అన్నారో పక్కకు పెడితే.. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్​ సరిపోతుందని అమెరికాలోని ఓ సభలో వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు బూమరాంగ్​ అయి కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని బీఆర్ఎస్​ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత కాంగ్రెస్​ పాలనలో విద్యుత్​ సమస్యలు ఉండేవి కాబట్టి ప్రజలు కూడా నిజమని నమ్ముతున్నారు. ఇక ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ తెలంగాణలో పర్యటించి తాము కర్ణాటకలో ఐదు గంటల కరెంట్​ ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. వెరసి ఈ ప్రకటనలు మొత్తం కాంగ్రెస్​ మెడకు చుట్టుకున్నాయి. తాను అలా అనలేదని రేవంత్​ అంటున్నారు. అయితే అందుకు సంబంధించిన వీడియోలను బీఆర్ఎస్​ కార్యకర్తలు సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలా? అర్థం కాక కాంగ్రెస్​ లీడర్లు తలలుపట్టుకుంటున్నారు.

గతంలో చంద్రబాబు మెడకు..


ఇక విద్యుత్​ అంశం గతంలో చంద్రబాబును సైతం ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా కరెంటు కోతలు ఉండేవి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనికితోడు విద్యుత్​ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ చంద్రబాబు హయాంలో రైతులు ఉద్యమిస్తే వారిపై కాల్పులు జరిపి చంద్రబాబు అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. ఇప్పటికీ బాబు మీద ఆ మరక పోవడం లేదు. రైతు వ్యతిరేకిగా చంద్రబాబు మీద ముద్ర పడింది. తెలంగాణ ఉద్యమసమయంలోనూ విద్యుత్​ విషయంలో అనేక చర్చలు జరిగాయి. రాష్ట్రం విడిపోతే కరెంట్​ ఉండదని అనేకమంది ఆంధ్రా మేధావులు చెప్పారు. అప్పటి సీఎం కిరణ్​ కుమార్​ రెడ్డి ఏకంగా ఇందుకు సంబంధించిన పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే కేసీఆర్​ ఎంతో విజయవంతంగా తెలంగాణలో విద్యుత్​ అంశాన్ని పరిష్కరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దగా కోతలు లేకుండా కరెంటు నిరంతరాయంగా సరఫరా అవుతోంది. ఏదైనా మరమ్మతులు వంటి కారణాలు ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్​ కోతలు ఉంటున్నాయి. ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇక 24 గంటల విద్యుత్​ ఇవ్వడాన్ని బీఆర్ఎస్​ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. అయితే రేవంత్​ రెడ్డి మాత్రం.. 24 గంటల విద్యుత్​ అవసరమేంటి? అన్నట్టుగా మాట్లాడటం బూమరాంగ్​ అయ్యింది. ఆయన లౌక్యం తెలియకే అలా మాట్లాడారని సొంతపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

కౌంటర్​ చేయడంలో కాంగ్రెస్​ ఫెయిల్


రేవంత్​ మూడు గంటల విద్యుత్​ సరిపోతుందని చెప్పడాన్ని బీఆర్ఎస్​ ప్రచారాస్త్రంగా మలుచుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రులు కేటీఆర్​, హరీశ్​ రావు ఏ సభకు వెళ్లినా ఇదే అంశాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు. అయితే రేవంత్​ కామెంట్లను కౌంటర్​ చేయడంలో కాంగ్రెస్​ ఫెయిల్​ అవుతోంది. మరోవైపు డీకే శివకుమార్​ తాము ఐదు గంటలు మాత్రమే కరెంట్​ ఇస్తున్నామని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం చేకూరింది. తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ 24 గంటల కరెంట్ ఇస్తే తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని జానారెడ్డి సవాల్​ విసిరారు. ఇక రేవంత్ రెడ్డి మూడు గంటల విద్యుత్​ ఆరోపణలు ఖండించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఉచిత విద్యుత్​ తీసుకొచ్చింది కాంగ్రెస్​ పార్టీయేనని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ మూడు గంటల విద్యత్​ అంశమే నిత్యం చర్చలో ఉండేలా బీఆర్ఎస్​ ప్లాన్​ చేస్తోంది. రాజకీయాల్లో ఆయుధాలను మనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉండదు.. శత్రువే మన చేతికి అందిస్తారన్న అంటుంటారు. ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్​ చేతికి కాంగ్రెస్​ నేతలు ఆయుధాన్ని అందించారన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు ధరణి తీసేస్తామని కాంగ్రెస్​ ప్రకటించడం.. రైతు బంధు దుబారా అని ఉత్తమ్​ వ్యాఖ్యానించడం సైతం బీఆర్ఎస్​ కు ఆయుధాలుగా మారాయి. మరి ఎన్నికల నాటికి మూడు గంటల విద్యుత్​ అంశం ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img