గృహజ్యోతి పథకం, ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం కోసం తెలంగాణ ప్రజలు వేయికండ్లతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నది. ఇప్పటికే పథకాల అమలుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈనెల 27 లేదా 29న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలపై కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సబ్సిడీ ఎలా అందించాలనే అంశంపై చర్చించారు. గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరపాలని సీఎం సూచించారు. గృహ జ్యోతి పథకం కింద జీరో బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు.