విజన్ 2047 పేరుతో చంద్రబాబు గారు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్ దశ – దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారు అని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో అనాడు UPA సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. నూతన రాజధానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఇవ్వాలని సూచించింది అని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండేవి. విభజన హామీలు అమలయ్యి ఉంటే రాష్ట్రం దిశ – దశ పూర్తిగా మారేది. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లేది అని అన్నారు. విభజన చట్ట హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే, రెండో ముద్దాయి చంద్రబాబు గారు..మూడో ముద్దాయి జగన్ మోహన్ రెడ్డి గారు. ముగ్గురు కలిసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు అని నిలదీశారు. ప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమే. హోదాతోనే రాష్ట్రానికి విజన్. మోడీ పిలక మీ చేతుల్లో ఉంది. విభజన హామీలపై ప్రధానిని నిలదీయండి. కేంద్రం గల్లా పట్టి రాష్ట్ర హక్కులను సాధించండి అని తెలిపారు.