హాల్‌మార్క్ గ్రీటింగ్ కార్డుల వ్యవస్థాపకుడు జోయస్ హాల్ ఏటా ఆగష్టు మొదటి ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. అప్పటి నుండి స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ఇలానే మరో కథనం కూడా ఉంది. 1958లో పెరూలో తొలిసారిగా ఫ్రెండ్‌షిప్ డే భావనను ప్రతిపాదించారు. అయితే 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ ఫ్రెండ్‌షిప్ డే అధికారికంగా ప్రకటించింది.
ఇవాళే అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం
స్నేహానికి వయోబేధం లేదు. హోదా, అధికారమూ అడ్డు కావు. మంచి స్నేహితుడు తోడుగా ఉంటే ఆ ధీమా, భరోసాయే వేరు. ఇద్దరు వ్యక్తులకు, రెండు మనసులకు సంబంధించిన ఈ స్నేహం తరతరాలకు తరగని తీపి జ్ఞాపకం పంచుతుంది. ఇవాళ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మన స్నేహితులతో మనం పంచుకున్న జ్ఞాపకాలు, గడిపిన మధురమైన క్షణాలు.. జీవితంలో ఒక్కసారి అయిన తలుచుకుని మన జీవితాలను సుసంపన్నం చేసే ఈ అద్భుతమైన సంబంధాల ప్రాముఖ్యతను తలుచుకునే సమయం ఆసన్నమైంది.
స్నేహితుల దినోత్సవం.. ప్రాముఖ్యత
బెస్ట్ ఫ్రెండ్స్ డే అనేది స్నేహితుల మధ్య ప్రత్యేక బంధాన్ని నిలుపుకోవడానికి ఒక అవకాశం. స్నేహితులు అంటే మనం ఎల్లప్పుడూ ఆధారపడగల వ్యక్తులు. ఏది ఏమైనా.. మంచి, చెడు సమయాల్లో ఎల్లప్పుడూ మనతో ఉంటారు. స్నేహాన్ని అలాగే తెలపాలని, ఇలా చెబితేనే.., అలా ఉంటేనే స్నేహమనే ప్రతిపాదనలంటూ ఏమి లేవు. ప్రతి ఒక్కరికీ తమ మనసుకు నచ్చిన స్నేహితులు ఉండే ఉంటారు. అలాంటి వారిని మనస్పూర్తిగా తలుచుకుంటూ ఈరోజును సరదాగా జరుపుకుంటే చాలు.