ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రైతు బంధు పథకం మూల లక్ష్యాన్నే దెబ్బ తీసే కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తోంది. వ్యవసాయ స్థిరీకరణను అడ్డుకొని అన్నదాతల నోట్లో మట్టి కొట్టేందుకు సర్కారు సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. రైతు భరోసా విధివిధానాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నయవంచనకు కుట్ర లేపుతోందా? అన్న డౌట్స్ వస్తున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో నిర్వీర్యమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతు బంధు పథకం తీసుకొచ్చారు. ఈ పథకం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. పొలాలను వదిలిన అన్నదాతలు మళ్లీ పల్లెటూర్లకు కదిలివచ్చి హలాలు పట్టారు. బీడు భూములను సాగు చేశారు. వ్యవసాయం చేయలేం బాబోయ్ అన్న రైతులు రైతు బంధు ఇస్తున్నారన్న ఆశతో సేద్యం మొదలుపెట్టారు. కేవలం రైతుబంధు సాయం వల్లే కొన్ని లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. బీడు భూములు పచ్చబడ్డాయి. పంటపొలాలు కళకళలాడాయి. వెరసి గ్రామసీమలు సిరులతో తులతూగాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నాశనం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. తాము పవర్ లోకి వస్తే ఎకరాకు పది కాదు.. పదిహేను వేలు ఇస్తామనడంతో రైతులు ఆ పార్టీకి ఓటేశారు. అయితే ఇప్పుడు మార్గదర్శకాల పేరుతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర కనిపిస్తోంది.
రైతు సంఘాలతో ఏం చర్చిస్తారు?
ఏ రైతు సంఘం నాయకుడు.. ఏ రైతు సంఘం సభ్యుడైనా రైతు బంధు లేదా రైతు భరోసా సాయం ఇస్తామంటే వద్దనరు. దాన్ని కొంతమొత్తం పెంచమంటారు. కానీ ఇప్పుడు సీలింగ్ పేరుతో రైతు భరోసా సాయానికి కొర్రీలు పెట్టే కుట్ర జరుగుతోందని తెలుస్తోంది. రాళ్లు, రప్పలు, సాగుచేయని భూములు, రియల్ ఎస్టేట్ భూములు, రోడ్లకు ఎక్కడైనా రైతు బంధు ఇచ్చిఉంటే దాన్ని ఆపడానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు కానీ.. సిలింగ్ పేరుతో ఐదెకరాలకో.. పదెకరాలకో కుదిస్తే మాత్రం మొత్తం లక్ష్యం నీరు గారే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కొన్ని చోట్ల రైతు బంధు రాళ్లు గుట్టలకు పడి ఉండవచ్చు. దాని సరిచేసి నిజమైన లబ్ధిదారులకు సాయం పెంచడంలో ఎవరూ అభ్యంతరాలు ఉండవు.
సీలింగ్ తో జరగబోయేది ఏమిటి?
రైతు బంధు ప్రధాన ఉద్దేశ్యం వ్యవసాయ స్థిరీకరణ. చిన్న సన్నకారు, పెద్దరైతులు అందరికీ పెట్టుబడి సాయం అందించాలని.. అప్పుడే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. పంట ఉత్పత్తి పెరుగుతుంది. వెరసి తెలంగాణ పల్లెలు పచ్చబడతాయి. రైతు తనకుతానే పెట్టుబడి సాయం సమకూర్చుకొని ఆర్థికంగా పరిపుష్ఠి సాధించిన వరకు ఈ పథకాన్ని కొనసాగించాలని కేసీఆర్ సంకల్పించారు. కేవలం రైతు బంధు సాయం కోసమే వ్యవసాయం చేసే రైతు ఉన్నారంటే అతీశయోక్తి కాదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పదెకరాలు ఉన్న రైతులకు మాత్రమే.. రైతు బంధు ఇస్తామంటే.. పదెకరాలు పది గుంటలు ఉన్న రైతు పరిస్థితి ఏమిటి? అన్న చర్చ జరుగుతుంది? అప్పుడు సదరు రైతు తనకు ఎక్కువ ఉన్న పొలాన్ని తన కుటుంబసభ్యుల పేరు మీద రిజిస్టర్ చేస్తాడు.. లేదంటే అమ్మేసుకుంటాడు? దీనివల్ల ప్రభుత్వానికి ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా రైతు తీవ్రంగా నష్టపోతాడు. ఏ రైతుకూడా పెట్టుబడి సాయాన్ని వదులుకొనేందుకు సిద్ధంగా ఉండడు. 100 ఎకరాలు ఉన్న రైతు కూడా తన పొలాన్ని కుటుంబసభ్యులకు రిజిస్టర్ చేస్తాడు. రైతుకు పొలంతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. తాను ఆరోగ్యంగా ఉన్నంతకాలం తన పేరుమీదే పొలం ఉంచుకోవాలని భావిస్తుంటాడు. అవసాన దశకు వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని వారసులకు పట్టా చేస్తాడు. ఒకవేళ తాను ముందే పట్టా చేస్తే ఆ పొలాన్ని పిల్లలు అమ్మేసుకుంటారు కాబట్టి.. ఏ రైతేనా పొలాన్ని కాపాడుకోవాలనే భావిస్తాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు తుగ్లక్ చర్యల వల్ల మొత్తం రైతాంగం ఇబ్బందులు పడే చాన్స్ ఉంది.
పంట వేసారా? లేదా? ఎలా గుర్తిస్తారు?
ఇక పంట వేసిన అన్నదాతలకు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తామనే మరో వెర్రి ప్రతిపాదన కూడా కాంగ్రెస్ సర్కారు చేయబోతున్నదన్న వార్తలు వస్తున్నాయి. నిజానికి పెట్టుబడి సాయం అంటే పంట వేయకముందే ఇచ్చేది. రైతు అప్పుల పాలు కాకుండా.. మిత్తీకి డబ్బులు తెచ్చుకొని ఇబ్బందులు పడొద్దని కేసీఆర్ రైతు బంధు మొదలుపెట్టిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంట వేశారో లేదో తనిఖీ చేసి ఆ తర్వాత సాయం చేస్తామనే మతిలేని పనికి సిద్ధమైంది. ఇలా సాయం అందిస్తే భారీ అవినీతి జరిగే అవకాశం కూడా లేకపోలేదు. కచ్చితంగా వ్యవసాయ అధికారులే పంట వేశారా? లేదా? అన్న విషయం నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వ్యవసాయ అధికారులు కచ్చితంగా లంచం డిమాండ్ చేస్తారో.. వెరసి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. రైతు బంధు పథకం ఈ దేశంలో సక్సెస్ ఫుల్ స్కీమ్. కానీ దాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ రకరకాల కుట్రలు చేస్తోంది. ఈ కుట్రలు మొత్తం రైతాంగం ఓ కంట కనిపెడుతూనే ఉంది. తమకు పెట్టుబడి సాయం విషయంలో ఏ మాత్రం అన్యాయం జరిగినా కీలెరికి వాత పెట్టేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు.