ప్రైవేట్ రంగ అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు కీలక సూచన చేసింది. ఏప్రిల్ 1, 2024 రోజున నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) Transactions చేయొద్దని సూచించింది. NEFT Transactions ఏప్రిల్ 1న అందుబాటులో ఉండకపోవచ్చని వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు పనులు ఉన్నందున నెఫ్ట్ సేవల్లో అంతరాయం కలగవచ్చని పేర్కొంది. అలాగే కొందరు ఎంపిక చేసిన కస్టమర్లకు నెఫ్ట్ ఫెసిలిటీ అందుబాటులో ఉన్నప్పటికీ.. మనీ ట్రాన్స్‌ఫర్ లో జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపింది. అందుకే ఎవరైనా ఏప్రిల్ 1వ తేదీన డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నట్లయితే నెఫ్ట్ ట్రాన్సాక్షన్లకు దూరంగా ఉండడమే మంచిదని తెలిపింది.
అదేవిధంగా ఏప్రిల్ 1, 2024 రోజున కస్టమర్లకు శాలరీ, ఇతర పేమెంట్స్ నెఫ్ట్ ద్వారా వచ్చినట్లయితే ఖాతాలో జమ అయ్యేందుకు జాప్యం జరగవచ్చని, అందుకు పలు కారణాలు ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. తమ కస్టమర్లు నెఫ్ట్ కి బదులుగా ఇమిడియెట్ పేమెంట్ సర్వీస్ (IMPS), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వంటివి ఏప్రిల్ 1, 2024న ఉపయోగించుకోవడం మంచిదని తెలిపింది. ఈ మేరకు తమ కస్టమర్లకు ఇ-మెయిల్స్ పంపిస్తోంది బ్యాంక్. అలాగే సోమవారం రోజున డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే విషయంలో ఏదైనా సహాయం కావాలంటే బ్యాంక్ కస్టమర్ సపోర్ట్ టీంని కాంటాక్ట్ కావచ్చని తెలిపింది. 18001600 /1800 2600 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.
మీరు ఏదైనా పని కోసం బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఏప్రిల్1, 2024న బ్యాంకులు మూసి ఉంటాయని గుర్తుంచుకోవాలి. చాలా రాష్ట్రాల్లో సోమవారం బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. వార్షిక అకౌంట్ క్లోజింగ్ కోసం బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే, మిజోరాం, చంఢీగఢ్, సిక్కిం, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో తెరిచి ఉంటాయి. బ్యాంకుకు వెళ్లే ముందే బ్యాంకు సెలవుల గురించి తెలుసుకుని వెళ్లడం మంచిది.
రూ.2 వేల కరెన్సీ నోట్లు ఉన్న వారు వాటిని మార్పిడి చేసుకోవాలనుకుంటే సైతం ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఏప్రిల్ 1న దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడి సేవలు ఉండవు. ఈ మేరకు ఆర్‌బీఐ తెలిపింది. సోమవారం రోజున నోట్ల మార్పిని సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.