ponguleti srinivas reddy:ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో కీలక నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019 వరకు ఎంపీగా కొనసాగారు. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఖమ్మం నుంచి పోటీ చేసి, పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓటమి పాలైన నామా నాగేశ్వర రావుకు 2019లో ఖమ్మం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్. టిక్కెట్ ఇవ్వనప్పటికీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీని అంటిపెట్టుకొనే ఉన్నారు. నాలుగేళ్ళుగా తన ప్రాతినిధ్యం క్రమంగా తగ్గుతూ వస్తున్నా ఆయన పార్టీ మారలేదు. కానీ అంత క్రియాశీలకంగా కూడా లేరు. తాజాగా వచ్చే ఎన్నికల్లో తాను అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా జిల్లాలో తనతో పాటు తన అనుచరులకు పార్టీ టికెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. ఇదే ప్రతిపాదనను కేసీఆర్ ముందుంచినట్లుగా సమాచారం. అయితే శ్రీనివాసరెడ్డి ప్రతిపాదనలపై కేసీఆర్ విముఖత వ్యక్తం చేయడంతో పొంగులేటి రాజకీయ వ్యూహం మారినట్లుగా తెలుస్తోంది. జనవరి ఒకటవ తేదీన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచర వర్గంతో భారీ ఎత్తున ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వేలాదిమంది ఆయన అనుచరులు, అభిమానులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్లు ఆయన పార్టీ మారనున్న సంకేతాలను బలపరచాయి. తన ప్రతిపాదనలపై ‘‘తేలుస్తారా లేక నన్నే తీర్చుకోమంటారా..? ’’ అంటూ శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్లు పరోక్షంగా టిఆర్ఎస్ అధిష్టాన వర్గానికి ఒక హెచ్చరికగా మారాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డిని వదులుకునేందుకే గులాబీ బాస్ మొగ్గు చూపుతున్నట్లుగా కథనాలు వచ్చాయి. పొంగులేటి పార్టీ అధిష్టానం ముందు ఉంచిన ప్రతిపాదన ప్రకారం ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని, అదే సమయంలో పాయం వెంకటేశ్వర్లుకు పినపాక, మట్టా దయానందుకు సత్తుపల్లి టికెట్లు ఇవ్వాలని.. వైరా లేదా అశ్వరావుపేటలో ఒకటి, ఇల్లెందు సీటు కూడా తన అనుచరులకు ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై కేసీఆర్ స్పందించకపోవడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించినట్లు ఆయన అనుచర వర్గం చెబుతోంది. ఇటీవల శ్రీనివాస్ రెడ్డి తన కూతురు వివాహాన్ని ఇండోనేషియాలోని బాలిలో జరిపించారు. ఈ వేడుకకు తెలంగాణలోని పలువురు రాజకీయ నాయకులను ఆయన ఆహ్వానించారు. ఈ వేడుకకు బిజెపి ముఖ్య నేతలు పలువురు హాజరయ్యారని, అక్కడే శ్రీనివాసరెడ్డి రాజకీయ వ్యూహంపై సమాలోచనలు జరిగాయని తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంక్రాంతి తర్వాత బిజెపిలో చేరతారని అందరూ భావిస్తున్నారు. ఇదిలా కొనసాగుతుండగానే తెలంగాణ ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కల్పించిన భద్రతను కుదించింది. ఇప్పటివరకు ఆయనకున్న 3+3 సెక్యూరిటీని, టు ప్లస్ టు కు మార్చింది. అదే సమయంలో ఆయన పర్యటనల సమయంలో వినియోగించే పోలీసు ఎస్కార్టు వాహనాన్ని కూడా తొలగించింది. ఈ చర్యలను పరిశీలిస్తే శ్రీనివాసరెడ్డిని వదులుకొనేందుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతుంది. తెలంగాణాలో పాగా వేయాలనుకుంటున్న బీజపీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దగా క్యాడర్ లేదు. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ బరిలో దిగే స్థాయి నేతలు కూడా అన్ని నియోజకవర్గాల్లో లేరు. పార్టీ అధిష్టానంపై గుర్రుగా వున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరితే, ఆయన వెంట వచ్చే బలమైన నేతలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిక్కెట్లివ్వవచ్చని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మకర సంక్రాంతి తర్వాత ఈ తంతు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.