ఈ కాలంలో వాట్సాప్ వాడని వారుండరు అంటే ఆశ్చర్యపోవాల్సిందే ! మెసేజ్‌లు చేయాలన్నా.. ఫొటోలు, వీడియోలను ఇతరులకు పంపించాలన్నా ముందుగా గుర్తొచ్చేది వాట్సాప్‌నే ! అంతలా మనతో మమేకపోయింది ఇది ! ఈ యాప్‌ను సమర్థంగా వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
అలా కాకుండా ఏవైనా తప్పులు చేశామో.. అవే మనకు లేని పోని ఇబ్బందులను తెచ్చిపెడతాయి. మరి సాధారణంగా మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తామో ఒకసారి చూద్దాం..
కాంటాక్ట్ లిస్ట్ అప్‌డేట్
ఎప్పుడో ఏదో అవసరం వచ్చిందని ఒక కాంటాక్ట్‌ను మన ఫోన్‌లో సేవ్ చేసుకుంటాం. కొంతమందితో ఒకటి రెండు సార్లే అవసరం పడుతుంది.
అయినా సరే అలాంటి వారి ఫోన్ నంబర్లు సేవ్ చేసుకుంటాం. ఆ తర్వాత వాళ్ల నంబర్ ఉన్న సంగతే మరిచిపోతుంటాం.
ఇలా చాలామంది ఫోన్లలో పరిచయం లేని వాళ్ల నంబర్లు సేవ్ అయి ఉంటాయి.
ఒక్కోసారి కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ల పేరు చూసినా కూడా వాళ్లెవరో కూడా గుర్తురారు.
కానీ వాళ్ల కాంటాక్ట్ మన ఫోన్‌లో ఉండటం వల్ల మన ప్రొఫైల్ పిక్, స్టేటస్‌లు కనిపిస్తుంటాయి.
మనకు పరిచయం లేని వ్యక్తులు కాబట్టి వాళ్లు మన డేటాను దుర్వినయోగం చేసే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి ఎప్పటికప్పడు కాంటాక్ట్ లిస్ట్ అప్‌డేట్ చేసుకోవాలి. అనవసరమైన నంబర్లను డిలీట్ చేయాలి.
ప్రొఫైల్ ఫొటో
వాట్సాప్‌కు చాలామంది తమ ఫొటోనే ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకుంటారు.
అంతవరకు బాగానే ఉంటుంది.. కానీ మన గురించి ఎక్కువ సమాచారం తెలిసేలా మన ప్రొఫైల్ పిక్ పెట్టుకోకపోవడం మంచిది కాదు.
మన కుటుంబ సభ్యులతో గ్రూప్ ఫొటోలు, ఇంటి లేదా అపార్ట్‌మెంట్ ముందు దిగిన ఫొటోలను ప్రొఫైల్ పిక్‌గా పెట్టకపోవడం బెటర్.
దీనివల్ల మన వ్యక్తిగత విషయాలు మన కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న అందరికీ తెలిసిపోతాయి.
అలా వ్యక్తిగత వివరాలు బహిర్గతమవ్వకూడదంటే.. ప్రైవసీ సెట్టింగ్స్‌లో సెట్ చేసుకోవచ్చు.
ఇందుకోసం మన ప్రొఫైల్ పిక్ every body అనే ఆప్షన్ నుంచి my contacts లేదా nobody అనే ఆప్షన్‌లోకి మార్చుకోవాలి.
టు స్టెప్ వెరిఫికేషన్
ఎవరైనా మన ఫోన్ దొంగిలించినప్పుడు, లేదా సైబర్ మోసగాళ్లు సిమ్ స్వాపింగ్ చేసినప్పుడు మన వాట్సాప్ ఖాతా సురక్షితంగా ఉండాలంటే సెట్టింగ్స్‌లో టు స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.
సెట్టింగ్స్‌లోని అకౌంట్స్‌లోకి వెళ్లి దీన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ఆన్ చేసుకోవడం వల్ల ఎవరైనా మన నంబర్‌తో వాట్సాప్‌లోకి లాగిన్ అవ్వగానే ఒక కోడ్ అడుగుతుంది.
అలాగే లాగిన్ వివరాల గురించి మెయిల్ కూడా వస్తుంది. కాబట్టి మనకు తెలియకుండా వేరే ఫోన్లలో మన వాట్సాప్‌ను వినియోగించలేరు.
స్టేటస్‌లు
వాట్సాప్‌లో చాలామందికి స్టేటస్‌లు పెట్టే అలవాటు ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా స్టేటస్‌లు పెట్టేస్తుంటారు.
కానీ ఇవి మన కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న అందరికీ కనిపిస్తాయి.
కాంటాక్ట్ లిస్ట్‌లో కేవలం కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే ఉంటే ఫర్వాలేదు.. కానీ ఇంకా పరిచయం లేని వ్యక్తుల నంబర్లు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
అందుకే స్టేటస్‌లు పెట్టేముందు వాటిని ఎవరు చూడాలో సెట్టింగ్స్‌లో ఎంచుకోవాలి.
సాధారణంగా సెట్టింగ్స్‌లో 1. my contacts, 2. my contacts except 3. only share with.. అనే మూడు ఆప్షన్‌లో ఉంటాయి.
వీటిలో మొదటి ఆప్షన్ ఎంచుకుంటే కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న వారందరూ మీ స్టేటస్‌లు చూడొచ్చు.
రెండో ఆప్షన్ ఎంచుకుంటే సెలెక్ట్ చేసిన కాంటాక్ట్స్‌కు కాకుండా మిగిలిన కాంటాక్ట్స్‌కు మీ స్టేటస్‌లు కనిపిస్తాయి.
ఇక మూడో ఆప్షన్ ద్వారా అత్యంత సన్నిహితులు మాత్రమే స్టేటస్‌లు చూసేలా కాంటాక్ట్స్‌ను ఎంచుకోవచ్చు.
వాట్సాప్ గ్రూప్‌లు
మన అనుమతి లేకుండానే ఏవేవో వాట్సాప్ గ్రూపుల్లో మనల్ని యాడ్ చేస్తుంటారు.
ప్రతిసారి ఈ గ్రూపుల నుంచి లెఫ్ట్ కావడం ఒక సమస్య. అందుకే మనకు తెలిసిన వారు మాత్రమే వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేసేలా సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు.
ఇందుకోసం ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ మిమ్మల్ని వాట్సాప్ గ్రూపుల్లో ఎవరు యాడ్ చేయవచ్చు అని మూడుఆప్షన్లు ఉంటాయి. 1. every body 2 my contacts 3. my contacts except. మొదటి ఆప్షన్‌లో ఎవరైనా మనల్ని గ్రూపులో యాడ్ చేయొచ్చు.
రెండో ఆప్షన్ ఎంచుకుంటే కేవలం కాంటాక్ట్స్‌లో ఉన్న వారు మాత్రమే యాడ్ చేయగలరు.
అదే మూడో ఆప్షన్ ద్వారా అత్యంత సన్నిహితులు మాత్రమే గ్రూపులో యాడ్ చేయగలరు.
వాట్సాప్ మీడియా ఫైల్స్
ప్రతిరోజు గ్రూపుల్లో వందలాది మెసేజ్‌లు వస్తుంటాయి. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని ఇంకా ఇతరత్రా ఫొటో మెసేజ్‌లు కూడా బోలేడు వస్తుంటాయి.
వాట్సాప్ మీడియా ఆటో సేవ్ ఆన్ ఉండటం వల్ల మన వాట్సాప్‌కు వచ్చిన మీడియా ఫైల్స్ అన్ని గ్యాలరీలోకి వచ్చి నిండిపోతాయి.
దీనివల్ల ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. అందుకే వాట్సాప్‌లో మీడియా ఫైల్స్‌కు ఆటో సేవ్ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవడం మంచిది.
చాట్ బ్యాకప్
ఐ క్లౌడ్, గూగుల్ డ్రైవ్‌లోకి ఎప్పటికప్పుడు బ్యాకప్ అయ్యే డేటా ఎన్‌క్రిప్టెడ్ వర్షన్‌లో ఉండదు. కాబట్టి అది అంత సురక్షితం కాదు.
గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లోకి బ్యాకప్ అయ్యే డేటాను ఎవరైనా దొంగిలించే అవకాశం ఉంటుంది.
కాబట్టి ముఖ్యమైన చాట్‌లను బ్యాకప్ చేసుకునే బదులు ఆ చాట్‌ను ఎక్స్‌పోర్ట్ చేసి ఎక్కడైనా సేవ్ చేసుకోవడం బెటర్ అని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
పోర్న్ వీడియోలు షేర్ చేయొద్దు
పోర్నోగ్రఫీ కంటెంట్ షేర్‌చేయడం చట్ట విరుద్ధం. వాట్సాప్‌లో పోర్న్ వీడియోలు షేర్ చేయడంపై రిపోర్ట్ వెళ్తే.. మీ నంబర్‌పై వాట్సాప్ నిషేధం విధిస్తారు.
అదికాకుండా మీ పై పోలీస్ కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉంది.
ఫేక్ న్యూస్
వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే మెసేజ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రూపుల్లో వచ్చే మెసేజ్‌లు చాలా వరకు నిజం కాకపోవచ్చు.
ఏదో సెన్సేషనల్ న్యూస్ అని మెసేజ్ రాగానే దాన్ని ధ్రువీకరించుకోకుండా తొందరపడి ఆ మెసేజ్‌లను అస్సలు ఫార్వర్డ్ చేయొద్దు.
దీనివల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇటీవల కాలంలో ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేయడం ద్వారా పలువురు జైలుకెళ్లిన సంఘటనలు చాలానే చూశాం.
అందుకే ఏదైనా మెసేజ్‌ను ఫార్వర్డ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.
అలాగే విద్వేషపూర్వక, సున్నితమైన అంశాలకు సంబంధించిన మెసేజ్‌లను కూడా ఎప్పుడూ ఫార్వర్డ్ చేయకూడదు.
ఇలాంటి వాటిపై ఎల్లప్పుడూ నిఘా ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి.
మెసేజ్‌ల ఆటో డిలీట్
వాట్సాప్ మెసేజ్‌లు ఎప్పటికప్పుడు ఆటో డిలీట్ అయ్యేలా ఇటీవల వాట్సాప్ ఓ ఫీచర్ తీసుకొచ్చింది.
ఈ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే నిర్ణీత సమయం తర్వాత ఆ మెసేజ్‌లు ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతాయి.
ముఖ్యమైన వ్యక్తుల చాట్ పక్కనపెట్టి.. గ్రూపులు, ఇతర కాంటాక్ట్‌లకు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా అనవసర మెసేజ్‌లు ఆటోమెటిగ్గా డిలీట్ అయిపోతాయి. దీనివల్ల స్టోరేజీ సమస్య కొంత తగ్గుతుంది.
వాట్సాప్ లాక్
వాట్సాప్ భద్రత కోసం ఆండ్రాయిడ్‌లో అయితే ఫింగర్‌ప్రింట్.. ఐఫోన్‌లో అయితే టచ్ ఐడీ ఫేస్ ఐడీ ఆప్షన్‌ను ఇచ్చింది.
ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా మీకు తెలియకుండా ఇతరులు మీ వాట్సాప్ ఖాతాను ఓపెన్ చేసి మెసేజ్‌లు చూడలేరు.
దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది.