ఇదేనిజం,శేరిలింగంపల్లి : హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. మియాపూర్ చైతన్య కాలేజీ లో ఓ విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మియాపూర్ కల్వరి టెంపుల్ వద్ద ఉన్న శ్రీచైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీ లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువున్న విద్యార్థి కౌశిక్ రాఘవ(17) తన గదిలో శుక్రవారం ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా విద్యార్థి మృతి పై తల్లి తండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా 15 రోజుల కిందట కాలేజీ లో పలు విద్యార్థి సంఘాల మధ్య ప్రాంతీయ విభేదాలు నడిచి ఒకరినొకరు కొట్టుకున్నట్లు తెలుస్తుంది. గత రాత్రి కూడా విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. అయితే ఉరేసుకున్న అనంతరం తోటి విద్యార్థులు స్కూటీపైననే దగ్గరలోని ఆసుపత్రికి తలించడం గమనార్హం. ఈ విషయం అప్పటివరకు యాజమాన్యంకు తెలియక పోవడం గమనార్హం. అయితే మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా గొడవల్లో గాయపడి ఏమైనా మరణించాడా తెలియాల్సి ఉంది.
విద్యార్థుల మధ్య ప్రాంతీయ విబేధాలు చోటు చేసుకుంటున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. కారణం ఏదయినప్పటికి ఇటీవల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు నగరంలో రోజురోజుకు పెరిగి పోతున్నాయి. నిన్న బాచుపల్లి, మొన్న మాదాపూర్ నేడు మియాపూర్ ఇలా చెప్పుకొంటూ పోతే రెండు మూడు నెలల కాల వ్యవధిలో మొత్తం 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. పలు విద్యార్థి సంఘాలు కాలేజీ కి చేరుకొని ధర్నా చేశారు. విద్యార్థి మృతికి ముమ్మాటికీ యాజమాన్యమే కారణమని కళాశాల అనుమతులు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.