TRS:కేసీఆర్ వేలితో కేసీఆర్ కంట్లో పొడవడానికి పక్కాగా ప్రణాళిక రూపొందించారు. దీనిని అతి త్వరలో రాబోయే ఎన్నికల ముందు అమలు పరిచేందుకు సమాయత్తం అవుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ని రద్దు చేసి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చారు. దీన్నే అవకాశంగా తీసుకుని కేసీఆర్ వ్యతిరేకులు పావులు జరుపుతున్నారు.
ఉద్యమంలో ఉండి రాజకీయ అవకాశాలు రానివారు , కేసీఆర్ ను ఎలాగైనా గద్దె దించాలనుకునేవారు , కేసీఆర్ చేతిలో రాజకీయంగా మోసపోయి ఇబ్బందులు పడుతున్నవారు .. ఇతర పార్టీలతో పాటు ,టీఆర్ఎస్ లో ఇమడలేక ఇబ్బంది పడుతున్నవారు , గుర్తింపు లేక సరైన న్యాయం జరుగక మరుగునపడుతున్నవారు ..ఇలా అందరిని కలుపుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టాలని చూస్తున్నారు . దీని కోసం కేసీఆర్ వదిలిపెట్టిన టీఆర్ఎస్ పార్టీని కొత్త పార్టీ పేరుతొ రిజిస్ట్రేషన్ చూపించాలని అనుకుంటున్నారు. దీనికి టీఆర్ఎస్ పేరు వచ్చేలా తెలంగాణ రైతు సమితి (టీఆర్ఎస్) పేరు ఖరారు చేసినట్లు తెలిసింది .. దీని వెనుక మహామహులు ఉన్నప్పటికీ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ కీలకంగా వ్యవహరిస్తాడనే ప్రచారం జరుగుతున్నది .ఇదే నిజమైతే ఇప్పటికీ టీఆర్ఎస్ ను మరిచిపోని జనం .. బీఆర్ఎస్ కు ఓటు వేయాలా టీఆర్ఎస్ కు ఓటు వేయాలా అనే సందిగ్ధానికి లోను అయ్యే పరిస్థితులు తలెత్తుతాయి .దీనివల్ల కేసీఆర్ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది .దీనిని తప్పించుకునేందుకు కేసీఆర్ తన మేధా శక్తికి పదును పెట్టినట్లు తెలిసింది . ఎలాగైనా టీఆర్ఎస్ ను దక్కించుకునేందుకు కేసీఆర్ వ్యతిరేక శక్తులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భాగస్వాములు కూడా కొత్త పార్టీలోకి వస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఇటీవల బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుని మనీ కొందరు నాయకులు ఆగిపోవడానికి కారణం కొత్త పార్టీ TRS అంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో సెన్సెషన్‌గా మారిన పార్టీ వ్యవహారంలో పార్టీ పేరు, జెండా, అజెండా కూడా ఇంకా సంచలనం రేపుతున్నాయి.