Homeఫ్లాష్ ఫ్లాష్టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ... సీఎం పీఠంపై కేటీఆర్‌.. అంతటా అదే చర్చ

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ… సీఎం పీఠంపై కేటీఆర్‌.. అంతటా అదే చర్చ

తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకస్మికంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తుండటంపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్య క్షులు హాజరవుతారు.

పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల నియామకం, ఏప్రిల్‌ 27న పార్టీ వార్షికోత్సవం సందర్భంగా మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారని పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ప్లీనరీ, సంస్థాగత అంశాలపై చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నా… ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ బాధ్యతలు స్వీకరిస్తారని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్‌ ఈ సమావేశంలో స్పష్టతనిచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ నెల 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం కాగా, మరుసటి రోజు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా పదవి చేపడతారని కొంతకాలంగా విస్తృత ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతకాలంగా ప్రకటనలు చేస్తుండగా, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ ఏకంగా కేటీఆర్‌ సమక్షంలోనే ముఖ్యమంత్రి మార్పిడికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి పదవిని కేటీఆర్‌ చేపట్టడం ఖాయమని, ఫిబ్రవరి లేదా మే నెలలో సీఎం మార్పు ఖాయమని పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టతనిచ్చే అవకాశముందని పార్టీ నేతలు భావిస్తున్నారు. సీఎం మార్పునకు సంబంధించిన ప్రచారం ఎక్కువ కాలం కొనసాగితే పార్టీకి నష్టం కూడా జరిగే అవకాశమున్నందున ఈ అంశంపై వీలైనంత త్వరగా స్పష్టతనివ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ ఉన్నట్లు తెలిసింది.

ఒకవేళ ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటే మాత్రం రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేదికగా సంకేతాలు ఇస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే అటు పార్టీలో, బయటా శరవేగంగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.

లోక్‌సభ ఎన్నికలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లుగా పార్టీ ప్లీనరీ జరగకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 27న భారీగా ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్‌ భావిస్తున్నారు.

సుమారు రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణంతో పాటు పార్టీ సభ్యత్వ పునరుద్దరణ వంటి అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

దీంతో పాటు త్వరలో జరిగే రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక, నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనం చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img