TRS WORKING PRESIDENT KTR FIRES ON TPCC CHIEF REVANTH REDDY : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై .. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… తీవ్రవ్యాఖ్యలు చేశారు.
అసలు పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకం తప్పని అర్థం వచ్చేలా బ్యాడ్ చాయిస్ అంటూ ట్వీట్ చేశారు.
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఒక క్రిమినల్.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయని ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంటరీ స్థాయి ఐటీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ శశిథరూర్ ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా.. తనను, తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారని కేటీఆర్ తెలిపారు.
దీన్ని సహించలేని రేవంత్ రెడ్డి కొందరు మీడియా ప్రతినిధులు ముందు సహచర ఎంపీని గాడిదతో పోల్చారంటూ కేటీఆర్ ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన ఆర్టికల్‌ను.. కేటీఆర్ తన ట్వీట్‌కు(ట్విట్టర్లో పీసీసీ చీఫ్ పేరును.. పీసీసీ చీప్‌గా కేటీఆర్ సంబోధించారు) జత చేశారు. ఒక క్రిమినల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయన్నారు.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకం తప్పని అర్థం వచ్చేలా.. తన ట్వీట్లో కేటీఆర్ రాసుకొచ్చారు.
బ్యాడ్ చాయిస్ అంటూ రాహుల్, ప్రియాంక గాంధీల పేర్లను ప్రస్తావించారు.
అసలు శశిథరూర్ ఏమన్నారంటే..
తెలంగాణ ఐటీ పాలసీని ఇతర రాష్ట్రాలు నేర్చుకుని ప్రయోజనం పొందేలా ఉందని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అధ్యక్షులు శశిథరూర్ ప్రశంసించారు.
రాష్ట్రంలో అమలవుతున్న ఐటీ పాలసీ అద్భుతంగా ఉందన్నారు.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా ఐటీ పాలసీని రూపొందించిన రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను ఆయన కొనియాడారు.
ఈ పాలసీ దేశానికే ఓ ఉదాహరణగా నిలిచిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ఐటీపాలసీ అధ్యయనంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఆయన బృందం సమర్పించిన ప్రజంటేషన్ ఆద్యంతం ఆకట్టుకుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ ఐటీపాలసీ లాగే నేషనల్ ఫారిన్ పాలసీలో సైతం రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలని శశిథరూర్ అన్నారు.
ఆయన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ సైతం సమర్థించారు. జాతీయ పాలసీల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరముందన్నారు.
శశిథరూర్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ అధ్యయనానికి తమవంతు సహకారం అందించినందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.