Homeఅంతర్జాతీయంTRUTH Social : ఫేస్‌బుక్, ట్విటర్‌లకు పోటీగా ట్రంప్ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫాం

TRUTH Social : ఫేస్‌బుక్, ట్విటర్‌లకు పోటీగా ట్రంప్ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫాం

Trump to launch new social media platform TRUTH Social : ఫేస్‌బుక్, ట్విటర్‌లకు పోటీగా ట్రంప్ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫాం..

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ అనే కొత్త సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను ప్రారంభించనున్నట్టు ప్రకటించారు.

అమెరికాలో వ్యతిరేక గళాలను అణచివేస్తున్నారని ఆరోపిస్తూ “నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రముఖ కంపెనీలకు చెందిన సోషల్ మీడియా నెట్‌వర్క్‌లకు పోటీగా దీన్ని తీసుకు రాబోతున్నాం”అని ట్రంప్ చెప్పారు.

ట్రంప్‌ అధికారంలోకి రావడంలో సోషల్‌ మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సోషల్‌మీడియా ద్వారా ప్రజలకు చేరువగా ఉండేవారు.

వాషింగ్టన్‌లో ఆ దేశ పార్లమెంట్ భవనంపై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడులు చేసిన అనంతరం ఆయనపై ట్విట్టర్‌ నిషేధం విధించగా, ఫేస్‌బుక్‌ ఆయన ఖాతాను సస్పెండ్‌ చేసింది.

ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆయన సోషల్‌మీడియా ఖాతాలపై నిషేధం విధించాలంటూ సోషల్‌మీడియా సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉండేది. ఆయన పోస్ట్‌లు అవమానించేవిగా, ఉద్రిక్తతలను ప్రేరేపించేవిగా, పూర్తి అసత్యపూరితమైనవిగా ఉండేవని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేవి.

గత సంవత్సరం ట్విట్టర్, ఫేస్‌బుక్ ఆయన చేసిన కొన్ని పోస్ట్‌లను తొలగించాయి. ‘‘కోవిడ్.. ఫ్లూ అంత ప్రాణాంతకం కాదు” అంటూ ఆయన చేసిన పోస్ట్ అలాంటివాటిలో ఒకటి.

అప్పటి నుండి డొనాల్డ్ ట్రంప్, ఆయన సలహాదారులు సొంత సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను స్థాపించడంపై దృష్టి పెట్టారు.

ఈ ఏడాది ప్రారంభంలో ‘ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జె ట్రంప్’ అనే పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అయితే ప్రారంభించిన నెలలోపే దీనిని శాశ్వతంగా మూసివేశారు.

“ఈ నిర్ణయం మేం చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు సహాయకారిగా ఉంటుంది” అని ట్రంప్‌ సీనియర్ సహాయకులు జాసన్ మిల్లర్ అన్నారు.

“తాజా వెంచర్ ట్రుత్ సోషల్ ప్రారంభ వెర్షన్ వచ్చే నెలలో కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2022 మొదటి మూడు నెలల్లో దేశ వ్యాప్తంగా అందరికీ అందుబాటులో రానుంది” అని ట్రంప్ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్ (టీఎమ్‌టీజీ) ఒక ప్రకటనలో తెలిపింది.

తాను సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను ఎందుకు ప్రారంభించాలనే విషయాన్ని ట్రంప్ వివరించారు. “తాలిబాన్లు సైతం ట్విట్టర్‌ను విస్తృతంగా వినియోగించుకుంటున్న రోజులివి. అదే సమయంలో మీకు ఇష్టమైన అధ్యక్షుడు మౌనంగా ఉండాల్సి వస్తోంది. ప్రముఖ కంపెనీలకు చెందిన సోషల్ మీడియా నెట్‌వర్క్‌లకు ధీటుగా ఎందుకు నిలబడటం లేదని నన్ను అడుగుతున్నారు. అందుకే ‍త్వరలో మేము రాబోతున్నాం” అని ట్రంప్‌ చెప్పారు.

‘ట్రంప్ బృందానికి హడావుడి ఎక్కువ’

డోనల్డ్ ట్రంప్ బృందం దీనిని ఎక్కువ చేసి చూపిస్తుంది. ఈ కొత్త కంపెనీకి ఇంకా వర్కింగ్ ప్లాట్‌ఫాం ఉన్నట్టుగా ఎలాంటి సమాచారం లేదు. కొత్త సైట్ కేవలం రిజిస్ట్రేషన్ పేజీ మాత్రమే.

ఆయన ట్విట్టర్ లేదా ఫేస్‌బుక్‌కు ప్రతర్థిగా ప్లాట్‌ఫాంను తయారు చేయాలనుకుంటున్నారు. కానీ అది అంత సులభం కాదు.

ట్రంప్‌ ‍ప్రారంభించే సోషల్‌మీడియా రాజకీయ స్వభావంతో కూడుకున్నది. ఇది ఆలోచనలను పంచుకునే ట్విట్టర్ వంటి వేదిక లేదా మొత్తం కుటుంబం ఉపయోగించే ఫేస్‌బుక్‌ లాంటి వేదికలా కాలేదు.

పార్లర్ లేదా గాబ్ వంటి ఇతర ‘ఫ్రీ స్పీచ్’ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలా విజయవంతం కావచ్చు.

డోనల్డ్ ట్రంప్ తన గళాన్ని స్పష్టంగా వినిపించాలని అనుకుంటున్నారు. అయితే ఇది సాధ్యం కావాలంటే ప్రముఖ సోషల్‌ మీడియా కంపెనీల సహకారం కావాల్సిందే. అయితే ఇది అంత త్వరగా జరిగే అవకాశం లేదు.

Recent

- Advertisment -spot_img