రైతు రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1, 2019 నుంచి డిసెంబరు 10, 2023 మధ్య రుణాలు తీసుకున్నవారికి మాఫీ వర్తిస్తుందని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేస్తారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని లోక్‌సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
వచ్చే ఖరీఫ్ సీజన్‌కు పెట్టుబడి కోసం రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తీసుకున్న లోన్లు చెల్లించకపోవడంతో బ్యాంకులు మళ్లీ అప్పులు ఇచ్చే పరిస్థితిలో లేవు. వడ్డీ తడిసిమోపెడయింది. బయట అప్పుతీసుకుందామంటే దాదాపు 5 నుంచి 20 శాతం వడ్డీ అడుగుతున్నారు. ఇవి కాక కుటుంబాన్ని పోషించాలి. పిల్లల్ని చదివించాలి. సరిగ్గా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యేనాటికే పాఠశాలలు, కాలేజీలు ఓపెన్ అవుతాయి. వాళ్ల ఫీజులు కట్టాలి. ఇలా ఎన్నో సవాళ్లు ప్రస్తుతం రైతుల ముందు ఉన్నాయి. ఈ తరుణంలో రుణమాఫీని ప్రభుత్వం త్వరగా అమలు చేస్తే రైతలకు ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడికోసం మళ్లీ అప్పు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.