- గవర్నర్ కార్యాలయానికి బిల్లు
- రాజ్ భవన్ నుంచి నో రిప్లై
- ఇప్పటికే కేబినెట్ ఆమోదం
- బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్
- మరోసారి అసెంబ్లీలో బిల్లు పెట్టే చాన్స్
ఇదే నిజం, స్టేట్ బ్యూరో: ఆర్టీసీ విలీనానికి ఆదిలోనే బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ బిల్లును కేబినెట్ ఆమోదించి గవర్నర్ కార్యాలయానికి పంపించింది. అయితే ఈ బిల్లుకు సంబంధించి రాజ్ భవన్ నుంచి ఎటువంటి ఆమోదం లభించలేదు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనుకున్న కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సర్కారుకు అనూహ్య పరిణామం ఎదురైంది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లుని ప్రవేశపెట్టాలనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం బిల్లుని పంపించగా.. ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం లభించలేదు. గవర్నర్ కార్యాలయానికి పంపించామని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అయితే తమకు ఎలాంటి బిల్లు అందలేదని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆర్టీసీ బిల్లు విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నట్టయ్యింది.
ఇదిలావుండగా.. ఆర్టీసీ విలీనం బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి కేబినెట్ కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసింది. ఇక బిల్లు ఆమోదం పొందితే వచ్చే ఎన్నికల్లో మైలేజీ ఉంటుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచిచూడాలి.