భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచనలు చేసింది. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్న నేపథ్యంలో టోకెన్లు, టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపింది. అలాగే వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్‌లైన్‌లో టికెట్లను పొందని భక్తులకు నేరుగా తిరుమల, తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టికెట్లు తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. అయితే ఈ నెల 9వ తేదీన శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టికెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది. ఆ రోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా నేరుగా దర్శనం చేసుకోవచ్చని టీటీడీ సూచించింది. కాగా, వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో పది రోజుల పాటు ఎలాంటి విశేష దర్శనాలకు భక్తులను అనుమతించరు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు కూడా ఈ రోజుల్లో అనుమతించరు.