ఇదే నిజం , మెదక్ ప్రధాన ప్రతినిధి: కంటోన్ మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం కేసులో పలు ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. సుల్తాన్ పూర్ ఔటర్ రింగు రోడ్డు పై ప్రమాదం జరిగిన సమయంలో రేలింగ్ తో పాటు ముందున్న లారీని కూడా ఢీకొట్టినట్లుగా పొలీసులు అనుమానిస్తున్నారు. అతివేగంగా వచ్చిన కారు ముందున్న వాహనానికి ఢీకొట్టిన ఆనవాళ్లను గుర్తించారు.
ప్రమాదంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు బ్యానెట్ పైభాగం పూర్తిగా ధ్వంసమైనట్లుగా గుర్తించారు. దీంతోపాటు కారుకు ఎడమవైపున ఉన్న ముందు చక్రం ధ్వంసమైంది. కారు మీటర్ బోర్డ్ 100 కిలోమీటర్ల స్పీడ్ వద్ద స్ట్రక్ అయినట్లు గుర్తించారు. నందిత కారు బ్యానెట్ పైన భాగం పై ఉన్న ఇసుక ఆనవాళ్లను క్లూస్ టీమ్ సేకరించినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు పై ఉన్న రేలింగ్ ని కారు ఢీ కొడితే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చన్న వాడనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పోలీసుల సమగ్ర విచారణ తరువాతే ప్రమాదం జరగడానికి గల అసలు కారణాలు తెలిసే అవకాశం ఉన్నది.