సంకల్పం ఉంటే జీవితంలో ఎంతటి లక్ష్యాన్నైనా సాధించగలమని, అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయొచ్చని నిరూపిస్తున్నారు రాజస్థాన్‌కు చెందిన ముదిత, రాజేష్ దంపతులు. మనిషి తలవెంట్రకలే కాదు, కొడి వెంట్రుకలు (ఈకలు) తోనూ బిజినెస్‌కు అవకాశాలున్నాయని రుజువు చేశారు. కోడి ఈకలతో వ్యాపారం చేస్తూ లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. కోట్లలో టర్నోవర్ చేస్తున్నారు. అదెలా అంటారా ?
పెళ్లి కాకముందు నుంచే ముదిత, రాజేష్ మంచి స్నేహితులు. కలిసే చదువుకున్నారు. జైపూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ విభాగంలో ఇద్దరూ ఎంఏ చేశారు.
ఆ సమయంలోనే వ్యర్థ పదార్థాలతో పనికొచ్చే ప్రాజెక్టు ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రాజెక్ట్ కోసం ఆలోచిస్తున్నారు. ఓ చికెన్ షాప్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ.. కోడి ఈకను చేతితో తాకాడు రాజేష్. కోడి ఈకలతో బట్టలు తయారుచేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన పుట్టింది. ఆ విషయాన్ని స్నేహితురాలు ముదితకి చెప్పడంతో ఆమె ఇంప్రెస్ అయింది. ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్ ని మొదలుపెట్టారు.
కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు, అవమానాలు:
ఈ ప్రాజెక్ట్ కోసం వీరిద్దరూ చాలా కష్టపడ్డారు. నిజానికి రాధేష్ కుటుంబ సభ్యులు ప్యూర్ వెజిటేరియన్స్. ఈ వ్యాపారానికి ఒప్పుకోలేదు. ఆర్థిక సహకారం కూడా అందించలేదు. ఆ టైంలో రాధేష్, ముదిత చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా వెనక్కి తగ్గలేదు. తమ కలల ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇది ఒక ప్రాజెక్ట్ ఆ? అని చాలా మంది ఎగతాళి చేశారు. ఇది వర్కవుట్ అయ్యే పని కాదు, టైం వేస్టు అంటూ అవమానించారు. ఎవరెన్ని మాటలు అన్నా కూడా వెనకడుగు వేయలేదు. ముందుకు సాగారు. అలా 2010లో స్టార్ట్ అయిన వీరి కలల ప్రాజెక్ట్.. 8 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2018లో పురుడు పోసుకుంది. 8 ఏళ్ల నిరీక్షణ ఫలితమే కోట్ల టర్నోవర్ బిజినెస్.
విదేశాలకు ఎగుమతి
చాలా పరిశోధన చేసి ఫైనల్ గా కోడి ఈకల్ని దుస్తులుగా మార్చే టెక్నిక్ ని కనిపెట్టారు. తయారు చేయడం ఓకే కానీ దాన్ని అమ్మడం అనేది వాళ్ళ ముందున్న సవాల్. కోడి ఈకలతో తయారు చేసిన దుస్తుల్ని మనవాళ్ళు కొనరు. మరెలా అని ఆలోచిస్తున్న టైంలో.. విదేశాల్లో వీటికి డిమాండ్ ఉందని తెలుసుకున్నారు. కోడి ఈకలతో చేసిన శాలువాలకి అక్కడ డిమాండ్ ఎక్కువని తెలుసుకున్నారు. విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించారు. అలా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఏటా కోట్లు సంపాదిస్తున్నారు.
3 లక్షలకు పైగా గిరిజన మహిళలకు ఉపాధి:
చిన్న కుటీర పరిశ్రమగా మొదలైన ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు ఒక పెద్ద పరిశ్రమగా ఎదిగింది. ముదిత అండ్ రాధేష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో పెద్ద బిజినెస్ నే రన్ చేస్తున్నారు. ‘ఉమెన్ ఆన్ వింగ్స్’ పేరుతో గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇప్పటి వరకూ 3,33,400 మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చారు. గిరిజన కుటుంబాలకు చెందిన పది లక్షల మంది పిల్లలు వీరి సహాయంతో పాఠశాలలకు వెళ్తున్నారు.