మహారాష్ట్రలో శివసేన కు చెందిన కొత్త ప్రచార గీతం వివాదంలో పడింది. అందులోని జైభవానీ, హిందూ అనే పదాలను తొలగించాలని సూచిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తమకు నోటీసులు పంపిందని పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేవెల్లడించారు. ఈసీ ఆదేశాలకు తాము కట్టుబడి ఉండబోమని ఆయన స్పష్టం చేశారు. పార్టీ గీతం నుంచి ఆ పదాలను తొలగించడం మహారాష్ట్రకు అవమానకరమని పేర్కొన్నారు.
‘‘తుల్జా భవానీ ఆశీస్సులతో ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందవీ స్వరాజ్‌ను స్థాపించారు. మతం, భవానీ మాత పేర్ల మీద మేం ఓట్లు అడగటం లేదు. ఈ పదాలను తొలగించమనడం అవమానకరం. దీన్ని మేం సహించం’’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. ‘‘ఒకవేళ మా మీద చర్యలు తీసుకోవాలనుకుంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ‘బజరంగ్ బలీ’ ప్రస్తావన తెచ్చినప్పుడు ఏం చేసిందో ఈసీ చెప్పాలి. అయోధ్య ఉచిత దర్శనం పేరిట అమిత్ షా ఓట్లడిగారు’’ అని తెలిపారు.