రాజ్యాంగం ప్రవేశపెట్టి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో ఇవాళ ప్రత్యేక చర్చ జరిగింది.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు దేశ రాజకీయ చరిత్రలో మరచిపోలేని మరకను మిగిల్చాయి. దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు చేపట్టారు. రాజ్యాంగం ఏర్పడిన 25 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ హయాంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ తీసుకొచ్చారు అని తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో మీడియా స్వేచ్ఛను అణచివేయడంతోపాటు ప్రజల ప్రాథమిక హక్కులు హరించబడ్డాయి. ఆ సమయంలో భారత ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ ఎంపీ హోదాను కోర్టు రద్దు చేసింది.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమర్జెన్సీ ప్రకటించారు. తన విజయం శూన్యమని ప్రకటించిన న్యాయమూర్తి హైకోర్టుకు సారథ్యం వహించే అవకాశం లేదనే పరిస్థితి ఏర్పడింది.ఎమర్జెన్సీ సమయంలో వేలాది మందిని అక్రమంగా జైళ్లలో ఉంచారు. ప్రజల హక్కులు, అధికారాలను హరించి ప్రజాస్వామ్య మౌలిక సూత్రాన్ని దెబ్బతీశారు.ఇలాంటి చర్యల మరకలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తుడిచివేయగలదు? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.