– రూ. కోట్ల వ్యవహారం గురించి మాట్లాడుతున్న వీడియోలు వైరల్
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోన్న వేళ అధికార బీజేపీకి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ కుమారుడు కొందరు వ్యాపారవేత్తలతో రూ.కోట్ల వ్యవహారం గురించి మాట్లాడుతున్నట్లు వీడియోలు వైరల్ అవుతుండటం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతుండగా.. అటు అధికార పార్టీ కూడా అవి ఫేక్ వీడియోలు అంటూ తిప్పికొడుతోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దిమనీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు దేవేంద్ర సింగ్ తోమర్.. కొంతమంది మధ్యవర్తులతో రూ.కోట్ల వ్యవహారం మాట్లాడుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై చర్చ జరుగుతుండగానే ఇటువంటిదే మరో వీడియో బయటకు రావడం కలకలం రేపింది.
ఇదే విషయాన్ని కీలకాంశంగా పేర్కొంటున్న కాంగ్రెస్.. బీజేపీపై ఆరోపణలు చేస్తున్నది.
గతంలో కర్ణాటకలో మాదిరిగానే ఇక్కడ కూడా భాజపా ప్రభుత్వం 50శాతం కమీషన్ ప్రభుత్వంగా మారిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగినీ నాయక్ విమర్శించారు. ఒకవేళ అది తప్పుడు వీడియో అయితే వాటిని ఎవరు రూపొందించి వైరల్ చేశారనే విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే విషయాన్ని ప్రస్తావించిన రాహుల్ గాంధీ.. భాజపా నేత బహిరంగంగా లంచం డిమాండు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు తోమర్ కుమారుడిపై మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీలను పంపుతుందా? అని ప్రశ్నించారు. ఈ వివాదంపై కేంద్రమంత్రి తోమర్ గ్వాలియర్‌లో మాట్లాడుతూ..‘బూటకపు చర్చలతో సమయాన్ని వృథా చేయకూడదు’ అంటూ బదులిచ్చారు. అది ఫేక్ వీడియో అని.. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని కేంద్ర మంత్రి కుమారుడు దేవేంద్ర సింగ్ కూడా పేర్కొన్నారు.