- సెప్టెంబర్ 30 వరకు స్కూల్స్ బంద్
- సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ థియేటర్లు
- సెప్టెంబర్ 30 వరకు సినిమా హాల్స్ తెరవొద్దు
- చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇండ్లకే పరిమితం
- అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీః స్కూల్స్ సెప్టెంబర్ 30 వరకు బంద్ చేయాలని, ఆన్‌లైన్ పాఠాలు ఇతర పనులకు 50 శాతం సిబ్బంది స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు అన్‌లాక్ 4.0 మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శనివారం ఉత్వర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లు దశల వారీగా పరుగులు తీయనున్నాయి. అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్ సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయన్నారు. సినిమా హాల్స్, స్విమ్మింగ్ పూల్స్ లపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం కొనసాగుతుందన్నారు. అయితే సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ థియేటర్లకు మాత్రం కేంద్రం అనుమతిచ్చింది. పెండ్లిలు, అంత్యక్రియలకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 100 మంది వరకు హాజరు కావొచ్చంది. సెప్టెంబర్ 21 తర్వాత క్రీడలు, మత-రాజకీయ సమావేశాలు నిర్వహించుకునేందుకు షరతులతోకూడిన అనుమతిని కేంద్ర హోంశాఖ ఇచ్చింది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఇప్పుడున్న నిబంధనలను కొనసాగుతాయని, అంతరాష్ట్ర ప్రయాణాలకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేవని ఉత్తర్వుల్లో పేర్కొంది. నాన్ కంటైన్‌మెంట్ జోన్లలో ఎలాంటి ఆంక్షలు అమలు చేయరాదని రాష్ట్రాలకు సూచించింది. గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులకు కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉందని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కేంద్రం హెచ్చరించింది.