2019 నాటి కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వైవాహిక అత్యాచార ప్రస్తావన భారతీయ చట్టాల్లో లేదని భార్యతో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది. భర్త తనతో పలుమార్లు అసహజ శృంగారంలో పాల్గొన్నాడంటూ ఓ మహిళ 2019లో కేసు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ మహిళ భర్త మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. సెక్షన్ 377 ప్రకారం భార్యాభర్తల మధ్య అసహజ శృంగారం అత్యాచారం కింద పరిగణించలేమని అతడి లాయర్ వాదించారు.
గురుపాల్ సింగ్ అహ్లూవాలియా అనే న్యాయమూర్తి ఈ కేసుపై విచారణ జరిపారు. ‘‘ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం, పదిహేనేళ్లు పైబడిన భార్యతో భర్త శృంగార చర్య అత్యాచారం కిందకు రాదు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా భారతీయ చట్టాలు ఇంకా గుర్తించలేదు. ఈ నేపథ్యంలో ‘అసహజ శృంగారానికి భార్య అనుమతి’ అంశం ప్రాధాన్యం కోల్పోతుంది. తనతో పాటు ఉంటున్న భార్యతో భర్త అసహజ శృంగారం నేరం కాదని సెక్షన్ 377 చెబుతోంది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే, సెక్షన్ 376బీ ప్రకారం విడిగా ఉంటున్న భార్యతో ఆమె అనుమతి లేకుండా శృంగారం అత్యాచారమేనని స్పష్టం చేశారు. కాబట్టి, ఈ కేసులో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని తీర్పు వెలువరించారు.