ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన జరిగింది. మోచేయి విరిగిందని ఆస్పత్రికి వెళ్లిన బాలికకు చేదు అనుభవం ఎదురైంది. డాక్టర్ ఆపరేషన్ చేస్తుండగా.. ఆకలేసిందని మధ్యలోనే బయటికి వెళ్లి రెండు గంటల తర్వాత వచ్చి ఆపరేషన్ పూర్తి చేశాడు. గతేడాది డిసెంబర్ 22 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి కథనం ప్రకారం..ఝాన్సీ జిల్లాలోని నవాబాద్ ప్రాంతానికి చెందిన కాజల్ శర్మ అనే బాలిక ఓ రోజు ఇంట్లో ఆకస్మాత్తుగా కింద పడిపోయింది. దీంతో ఎడమ మోచేతి ఎముక విరిగిపోయింది. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఓ ఆర్థోపెడిక్ సర్జన్ ఆ బాలిక చేతికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. గతేడాది డిసెంబర్ 22న సర్జరీ చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. అయితే, ఆపరేషన్ మొదలు పెట్టిన కొద్ది సేపటికే ఆకలిగా ఉందని మసాలా దోశ తిని వచ్చి పూర్తి చేస్తానని చెప్పి మధ్యలోనే వెళ్లిపోయాడు. దాదాపు 2గంటల తర్వాత తిరిగి వచ్చి ఆపరేషన్‌ను పూర్తి చేశాడు. కానీ ఆపరేషన్ తర్వాత చేతికి నయం కాలేదని, అలాగే వేళ్లు కూడా వంకరగా మారాయని బాలిక మళ్లీ ఆ డాక్టర్‌ను కలిసేందుకు ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆమెను కలిసేందుకు డాక్టర్ నిరాకరించాడు. దీంతో ఆ బాలిక మరో ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.
ఆపరేషన్ చేసే సమయంలో తాను అన్నింటిని చూశానని, వినగలిగానని బాలిక అంటుంది. ‘ చేయి మాత్రమే మొద్దుబారిపోయింది. ఆపరేషన్ ఎలా చేస్తున్నారో నేను చూడగలిగాను. మధ్యలో నాకు ఆకలిగా ఉందని మసాలా దోశ తిని వస్తానని చెప్పి డాక్టర్ వెళ్లాడు. దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి వచ్చి హడావిడిగా ఆపరేషన్ పూర్తి చేశాడు. ఈ సర్జరీ తర్వాత గ్యారంటీగా చేయి నయం అవుతుందని డాక్టర్ చెప్పాడు. కానీ, నయం కాలేదు. అదే కాకుండా చేతి వేళ్లు కూడా వంకరగా మారాయి. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే కలిసేందుకు నిరాకరించారు. ఇంకా వేరే ఆస్పత్రిలో వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నా’ అని కాజల్ శర్మ తెలిపింది.
పట్టించుకోని అధికారులు
ఈ విషయంపై నవాబద్ పోలీస్ స్టేషన్లో డాక్టర్‌పై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాలిక అంటోంది. ఆ తర్వాత ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని సీఎం ఆఫీస్‌కు వెళ్లింది కాజల్. అక్కడ కూడా సిబ్బంది బిజీగా ఉన్నారని చెప్పారు. దీంతో నేరుగా సీఎంను కలిసి ఫిర్యాదు చేస్తామని బాలిక తెలిపింది.