న్యూఢిల్లీ: 2021 సంవత్సరానికి సంబంధించిన ఎగ్జాం షెడ్యూల్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) తాజాగా ప్రకటించింది. ఎగ్జామ్స్ నిర్వహించే తేదీలను తెలిపే వివరాల pdf ను వెబ్ సైట్లో పొందుపరిచింది. ప్రధానమైన పరీక్షల విషయానికి వస్తే.. 2021 సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది జూన్ 27న, మెయిన్స్ సెప్టెంబర్ 17 నుంచి 5 రోజుల పాటు నిర్వహించ నున్నారు. అదేవిధంగా ఈ ఏడాది వాయిదా పడ్డ సివిల్స్ 2020 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అక్టోబర్ 4న, మెయిన్స్ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 8 నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. ఇంజినీరింగ్ సర్వీసెస్ మెయిన్ 2021 పరీక్షను అక్టోబర్ 10న, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ 2021 పరీక్షను నవంబర్ 21న నిర్వహించేందుకు ప్రణాళికను యూపీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు మరిన్ని ప్రధాన పరీక్షలు నిర్వహించే తేదీలతో పాటు నోటిఫికేషన్ విడుదల చేసే తేదీలను కూడా ముందుగానే యూపీఎస్సీ ప్రకటించింది.