టీ20 క్రికెట్‌లో యూఎస్ఏ సంచలనం సృష్టించింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఈ అరుదైన ఘనత సాధించింది. హ్యూస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అమెరికా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న తరుణంలో ఈ విజయం అమెరికా జట్టులో రేటింపు ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందనే చెప్పాలి. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. తౌహిద్ 47 బంతుల్లో 58 టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యూఎస్‌ఏ బౌలర్లలో స్టీవెన్ టేలర్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో యునైటెడ్ స్టేట్స్ 19.3 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే యూఎస్ఏ 94 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. కానీ ఆండర్సన్ 25 బంతుల్లో 34* పరుగులు చేయగా, హర్మీత్ సింగ్ 13 బంతుల్లో33* పరుగులతో బంగ్లాకు మరో అవకాశం ఇవ్వకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.