USA takes stand for india : భారత దేశ భద్రతా ప్రయోజనాలకే పెద్ద పీట..
ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే ఉగ్రవాదంపై భారత దేశ ఆందోళనను అర్థం చేసుకున్నట్లు అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వెండీ షెర్మన్ చెప్పారు.
ఆఫ్ఘనిస్థాన్ విషయంలో భారత్, అమెరికాలది ఒకే మనసు, ఒకే వైఖరి అని తెలిపారు.
మూడు రోజుల పర్యటనకు వచ్చిన షెర్మన్ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లాతో బుధవారం సమావేశమయ్యారు.
ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకుని, తమ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు.
అయితే ఆ ప్రభుత్వానికి భారత్, అమెరికా గుర్తింపు ఇవ్వలేదు. ఆ దేశంలో పరిస్థితులను పరిశీలిస్తూ, వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ శృంగ్లాతో జరిగిన సమావేశం అనంతరం షెర్మన్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ విషయంలో భారత్, అమెరికా ఒకే విధమైన షరతులను విధించాయన్నారు.
అన్ని వర్గాలను కలుపుకొని పోయే సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, ఆఫ్ఘన్ గడ్డ ఉగ్రవాదులకు అడ్డాగా మారకుండా నిరోధించడం, మానవ హక్కులను గౌరవించడం, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెళ్ళిపోవాలనుకునేవారు సురక్షితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పించడం వంటి షరతులను విధించినట్లు తెలిపారు.
భారత దేశ భద్రతా ప్రయోజనాలు తమకు చాలా ముఖ్యమని, భారత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తామని చెప్పారు.