ప్రస్తుత పరిస్థితుల్లో ‘విటమిన్-డి’ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కరోనా వైరస్ బారిన పడ్డవారు త్వరగా కోలుకోవాలంటే, రోజూ ఎండలో కాసేపు కూర్చోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
కారణం సూర్యరశ్మి చర్మాన్ని తాకినప్పుడు ఈ విటమిన్ తయారవుతుంది.
శరీరంలోని ఇమ్యూనిటీ సెల్స్ వంటి ఎన్నో కణాల్లో ‘విటమిన్-డి’ రిసెప్టార్లు ఉంటాయి.
అవి ‘విటమిన్-డి’ మాలిక్యూల్స్‌కు స్పందించి శరీరంలో రకరకాల మార్పులకు కారణవుతాయి.
‘విటమిన్-డి’ ఎముకలు, గుండె ఆరోగ్యానికి, రోగ నిరోధకతకు, టైప్-1 డయాబెటిస్ నియంత్రణకు సాయపడుతుంది.
మానసిక ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
జలుబు, ఫ్లూ నుంచి రక్షిస్తుందా?
కచ్చితంగా కాపాడుతుందని చెప్పొచ్చు. ‘విటమిన్-డి’ లోపం ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్లకు ఆస్కారం ఎక్కువ.
ఈ విటమిన్ లోపం ఉన్నవారి శ్వాసకోశ వ్యవస్థకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదమూ అధికమే. ఇన్‌ఫ్లుయెంజా కూడా కాచుకొని ఉంటుంది.
జపాన్‌లోని పిల్లలపై ఓ అధ్యయనం జరిపారు పరిశోధకులు. అందులో భాగంగా 15-17 వారాలపాటు రోజూ ‘విటమిన్-డి’ సప్లిమెంట్స్ ఇచ్చారు.
దీనివల్ల శీతకాలంలో ఇన్ఫెక్షన్ రేట్ 42 శాతం మాత్రమే కనిపించిందట.
మరో అధ్యయనంలో పిల్లలకు మూడు నెలలపాటు ‘విటమిన్-డి’ సప్లిమెంట్స్ ఇచ్చారు.
చలికాలంలో ఆ బృందంలో ఎవరిలోనూ శ్వాసకోశ ఇబ్బందులు రాలేదట.
పిల్లలే కాదు, పెద్దల్లోనూ రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే, ‘విటమిన్-డి’ చాలా ముఖ్యమని వారంటున్నారు.
కొవిడ్‌నుంచి కాపాడుతుందా?
ఇప్పటి వరకు కొవిడ్-19కు ఎలాంటి మందులూ లేవు. కానీ, ఈ ‘విటమిన్-డి’ సప్లిమెంట్స్ మాత్రం వైరస్ సోకకుండా కాపాడగలవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
తాజాగా పరిశోధకులు మొత్తం 235 మంది కొవిడ్ పేషెంట్ల డేటా తీసుకున్నారు.
అందులో, ‘విటమిన్-డి’ పుష్కలంగా ఉన్న 40 ఏండ్లు దాటిన వారిలో 51.5 శాతం మంది కరోనా ప్రభావానికి తీవ్రంగా గురికాలేదని తేల్చారు.
అలాగే, ఈ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకున్నవాళ్లలో ఇమ్యూన్ రెస్పాన్స్ బాగా ఉంటున్నదని, శ్వాస సంబంధ సమస్యలూ రాలేదని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎలా పొందాలి?
రోజూ కాసేపు ఎండలో నిలబడితే చాలు. ఆ సమయంలో భుజాలు, ముఖం, కాళ్లపై సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి.చేపలు, కాలేయం, గుడ్డు పచ్చసొన, విటమిన్-డి ఫోర్టిఫైడ్ నూనె, పాలు వంటివాటి ద్వారా ‘విటమిన్-డి’ లభిస్తుంది.