పూర్వం యుద్ధం గెలవడానికి గ్రీకులు, రోమన్లు శత్రు సైన్యంపై తేనెటీగలు, తేల్లను వదిలేవారట.
రెండో ప్రపంచ యుద్ధంలో కూడా జపాన్‌పై అమెరికా విమానాలతో మాత్రమే గాక గబ్బిలాల సాయంతో కూడా బాంబులను విసిరినట్టు ఆధారాలు ఉన్నాయి.
దక్షిణాఫ్రికాలో కరువు తాండవిస్తుండటంతో పావురాల కాళ్లకు విత్తన సంచులను కట్టి.. విస్తారంగా పంటలు పండించిన దక్షిణాఫ్రికన్ల వినూత్న ప్రణాళికలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఇక తాజాగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి దోమలు ఒక ఆయుదంగా మారనున్నాయా?
దశాబ్దం క్రితం జపాన్‌కు చెందిన శాస్త్రవెత్తలు చేసిన ఓ పరిశోధన ఈ కొత్త ఆలోచనలకు బలం చేకూరుస్తుంది.
ఇరవై ఏండ్ల క్రితమే ఆఫ్రికా, ఆసియా, అమెరికా, దక్షిణ ఐరోపాలోని కొన్ని దేశాలలో ‘లెయిష్‌మెనియాసిస్’ అనే భయంకరమైన వ్యాధి వ్యాప్తి చెందింది.
ఈ వ్యాధి ఎడారిలో ఉండే కొన్ని రకాల ఈగలు, కీటకాల ద్వారా వ్యాపించింది. ప్రొటోజోవా వర్గ పరాన్నజీవి వల్ల కలిగే ఈ వ్యాధి సోకిన వారి చర్మం దద్దుర్లతో నిండి రక్తస్రావం జరుగుతుంది.
ఈ భయంకర వ్యాధిని తగ్గించడానికి ‘ఎస్పీ 15’ అనే వ్యాక్సిన్‌ను కనుగొన్నారు.
కానీ కొన్ని ఆఫ్రికా దేశాల్లోని మారుమూల ప్రాంతాల్లో టీకాను పంపిణీ చేయడం కుదరలేదు.
దీంతో జపాన్ పరిశోధకులు వ్యాక్సిన్ వేసేందుకు ‘దోమలను’ రంగంలోకి దించారు.
దోమలను కుట్టించి..
మనిషిని కుట్టి రక్తం పీల్చే క్రమంలో దోమలు ఓ రకమైన సలైవా (లాలాజలాన్ని) శరీరంలోకి స్రవిస్తాయి.
అవి కుట్టినప్పుడు రక్తం గడ్డకట్టకుండా కూడా ఇది పనిచేస్తుంది.
శాస్త్రవెత్తలు తమ ప్రయోగాలతో వాటి లాలాజలంలో చాలాకాలం జీవించేట్టు వీలుగా ఎస్పీ 15లో కొన్ని మార్పులు చేసి అక్కడి దోమల్లోకి ఈ టీకాను ఎక్కించి ఆ దోమలను వ్యాక్సిన్ వాహకాలుగా మార్చారు.
ఈ దోమలు, వాటితో కలిసే దోమల్లో, అవి పెట్టే గుడ్లలో కూడా ‘ఎస్పీ 15’ వ్యాక్సిన్ ఉండేలా చేశారు.
ఇలా విజృంభించే దోమలతో వాటి లాలాజలంలోని ఎస్పీ15 వ్యాక్సిన్ అక్కడి ప్రజల శరీరాల్లోకి ప్రవేశించింది.
అలా వ్యాధి కట్టడి జరిగింది. దీనికి సంభందించిన పూర్తి వివరాలు ‘ఇన్‌సెక్ట్ మాలిక్యులర్ బయాలజీ’లో సైతం ప్రచురితమయ్యాయి.
ఇప్పుడు ఆ టెక్నిక్ పనిచేస్తుందా?
ఎస్పీ15 వ్యాక్సిన్ తరహాలోనే కరోనా టీకాలను కూడా దోమలు/కీటకాల ద్వారా మనుషులకు ఇంజెక్ట్ చేయాలని పలువురు సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు.
కానీ ప్రస్తుతం ఈ ప్రక్రియ అంత సులువు కాకపోవచ్చు. ఒక టీకా తయారీకి కనీసం 10 సంవత్సరాల కాలం పడుతుంది.
కానీ కరోనా వ్యాక్సిన్‌ను ఏడాదిలోనే తయారు చేశారు. కాబట్టి దీనికి చాలా అడ్డంకులు ఉన్నాయి.
దోమల సలైవాలో ఈ వ్యాక్సిన్ పనితీరుపై ప్రయోగాలు జరుగలేదు.
ఎస్పీ15 వ్యాక్సిన్ తీసుకునే మోతాదులో ఎలాంటి పరిమితులు లేవు. దీంతో ఒక వ్యక్తిని దోమలు మళ్ళీ మళ్ళీ కుట్టినా డోసు ఎక్కువయి ప్రమాదానికి గురి కాలేదు.
కరోనా వ్యాక్సిన్‌ను మాత్రం ప్రస్తుతం శాస్త్రవెత్తలు రెండు డోసులు మాత్రమే సిఫారసు చేస్తున్నారు.
కానీ దోమల రెండు డోసుల కంటే ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్ చేరే అవకాశముంది.
కాబట్టి, ప్రస్తుతం దోమలు/కీటకాల ద్వారా వ్యాక్సిన్ వేయడం కుదరదు. కానీ భవిష్యత్తులో ఈ అవకాశాల ఉపయోగించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.