Homeఅంతర్జాతీయంకండోమ్స్, గ్లౌజులు, టైర్ల తయారీలో వాడే విలువైన ముడిప‌దార్థం పదార్థం త్వ‌ర‌లో దొర‌క‌దా ఇక‌.. #Rubber...

కండోమ్స్, గ్లౌజులు, టైర్ల తయారీలో వాడే విలువైన ముడిప‌దార్థం పదార్థం త్వ‌ర‌లో దొర‌క‌దా ఇక‌.. #Rubber #Condoms #Gloves #Tyre

వాతావరణ మార్పులు, పెట్టుబడిదారీ విధానం, రకరకాల వ్యాధులు ప్రపంచంలోని రబ్బర్ చెట్లకు పెను ముప్పుగా మారాయి.

మరీ ఆలస్యం కాకముందే రబ్బరుకు ప్రత్యామ్నాయ వనరులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రబ్బరు చాలా దృఢంగా ఉంటూ, సాగే గుణం ఉండి వంచగలిగే వీలున్న వాటర్‌ప్రూఫ్ పదార్థం.

ఇది మన వాహనాలకు టైర్లుగా, బూట్ల సోల్‌గా, ఇంజన్లకు, రిఫ్రిజిరేటర్లకు చక్కటి సీల్‌గా.. వైర్లు, మిగతా ఎలక్ట్రికల్ వస్తువులు షాక్ కొట్టకుండా ఇన్సులేటర్‌గా పనిచేస్తుంది.

కండోమ్స్ కోసం, దుస్తుల కోసం, క్రీడల్లో బంతుల కోసం, ఎలాస్టిక్ బాండ్స్ కోసం దీనిని ఉపయోగిస్తున్నారు.

ముఖ్యంగా గత ఏడాదిగా మహమ్మారి కాలంలో డాక్టర్లకు, నర్సులు వేసుకునే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్‌గా ఇది కీలక పాత్ర పోషించింది.

రబ్బర్‌ను నిజానికి ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యమైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు.

అందుకే యూరోపియన్ యూనియన్ దీనిని కీలక ముడి పదార్థాల జాబితాలో చేర్చింది.

అయితే, ప్రపంచవ్యాప్తంగా రబ్బరు సహజ ఉత్పత్తి తగ్గిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

వ్యాధులు, వాతావరణ మార్పులు, ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్న ధర.. రబ్బరు సరఫరాను ప్రమాదంలో పడేసింది.

ముప్పు ముంచుకు రాకముందే శాస్త్రవేత్తలు దీనికి ఒక పరిష్కారం వెతికే పనిలోపడేలా చేసింది.

రబ్బరు ప్రమాదంలో ఎలా పడింది

ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ టన్నుల సహజ రబ్బరు సరఫరా అవుతుంది.

దీనిని దాదాపు పూర్తిగా ఉష్ణమండల అడవుల్లో చిన్నచిన్న తోటల ద్వారా సన్నకారు రైతులే సాగు చేస్తున్నారు.

థాయ్‌లాండ్, ఇండోనేసియా, చైనా, పశ్చిమ ఆఫ్రికాలోని రబ్బరు తోటల్లో లక్షలాది కార్మికులు పనిచేస్తుంటారు.

రబ్బరు చెట్ల బెరడును జాగ్రత్తగా వలిచి, వాటి నుంచి తెల్లటి పాలను తీస్తారు.

తర్వాత వాటిని ఎండలో పలకల ఆకారంలో ఆరబెడతారు. ప్రపంచంలోని సహజమైన రబ్బరు సరఫరాలో 85 శాతం ఈ రైతుల నుంచే జరుగుతోంది.

కానీ, ఈ సరఫరా ఇప్పుడు ప్రమాదంలో పడింది. బ్రెజిల్‌ చిత్తడి అడవుల్లోని ‘హీవియా బ్రసిలియెన్సిస్’ అనే రబ్బరు చెట్టుకు దక్షిణమెరికా ఆకు తెగులు రావడంతో ఉత్పత్తి పడిపోయింది.

వినాశకరమైన ఈ వ్యాధి 1930లో దేశంలోని రబ్బరు పరిశ్రమను దారుణంగా దెబ్బతీసింది.

ప్రస్తుతం ఇది దక్షిణ అమెరికా దాటకుండా కఠిన క్వారంటైన్ నియంత్రణలు అమలుచేస్తున్నారు, అయితే, ఇది ఆసియాకు చేరడం దాదాపు అనివార్యంగా భావిస్తున్నారు.

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రబ్బరు రైతులు తెల్ల వేరు వ్యాధి, ఆయిల్ పామ్ తోటల నుంచి వ్యాపించిన మిగతా తెగుళ్లను ఎదుర్కొంటున్నారు.

రబ్బరు ఉత్పత్తిపై వాతావరణ మార్పులు కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

థాయ్‌లాండ్‌లో ఇటీవలి ఏళ్లలో వచ్చిన కరవులు, వరదల వల్ల రబ్బరు ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింది.

రబ్బర్ డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం రైతులకు శుభవార్తే అవుతుంది. వారు రబ్బర్ తోటలు పెంచి మరిన్ని లాభాలు సంపాదించవచ్చు.

కానీ అలా జరగడం లేదు. ఎందుకంటే, రబ్బరు ధరను ఎక్కడో ఉన్న షాంఘై ఫ్యూచర్స్ ఎక్ఛేంజ్ నిర్ణయిస్తుంది.

అక్కడి బ్రోకర్లు బంగారం, అల్యూమినియం, ఇంధనంతో పాటూ రబ్బరు ధరను కూడా అంచనా వేస్తారు.

రబ్బరు ధరలకు, దాని ఉత్పత్తి వ్యయానికి ఎలాంటి సంబంధం ఉండదు, అని రబ్బర్ కొనుగోలు సంస్థ హల్సియాన్ అగ్రి కో-ఫౌండర్ రాబర్ట్ మెయెర్ అన్నారు.

తక్కువ ధరల వల్ల రైతులు తమ చెట్ల నుంచి మరింత రబ్బరు పొందడానికి ప్రయత్నిస్తారు. అలా ఆ చెట్లు బలహీనంగా మారి, వ్యాధుల బారిన పడతాయి.

రబ్బర్ సరఫరా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తమ ఆదాయం కూడా ఆ ధరలకు సమానంగా ఉండాలని రైతులు భావిస్తారు.

ధరలు తక్కువగా ఉంటే, రైతులను తమ చెట్ల నుంచి మరింత రబ్బరు పిండాలని ప్రయత్నిస్తున్నారు.

దాంతో, ఆ చెట్లు బలహీనమై, మరిన్ని వ్యాధులకు గురవుతాయి.

ధర తక్కువగా ఉండడం వల్ల రైతులకు చనిపోయే దశలో ఉన్న రబ్బరు చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటాలనే ఆసక్తి కూడా పోయింది.

అలా, చాలామంది రైతులు తోటలను పూర్తిగా వదిలేశారు” మెయెర్ చెప్పారు.

“ఒక నిర్ణీత భూమిలో ఆయిల్ పామ్, సహజ రబ్బర్ పంటకు వచ్చే మొత్తం ఒకేలా ఉంటుంది.

కానీ, రబ్బర్ కోసం ఎక్కువ కష్టం చేయాల్సుంటుంది”. అని ఎలియనోర్ వారెన్ థామస్ అన్నారు.

ఆమె బాంగోర్ యూనివర్సిటీలో రబ్బర్ తోటల గురించి అధ్యయనం చేస్తున్నారు.

రబ్బర్ ధర పడిపోతుండడంతో, రైతులు రబ్బర్ ఉత్పత్తిని ఆపేసి, ఆ చెట్లను కొట్టి కలప అమ్ముకుంటున్నారు.

ఆ ప్రాంతంలో ఆయిల్ పామ్ తోటలు పెంచుతున్నారు.

ఇలాంటి సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా రబ్బరు సరఫరా ప్రస్తుతం, డిమాండును అందుకోలేని దశకు చేరింది.

2020 నాటికి ప్రపంచ రబ్బరు సరఫరాలో దాదాపు 7 శాతం, అంటే 9 లక్షల టన్నుల తగ్గుదల కనిపించవచ్చని 2019 చివర్లో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పుడు అంతర్జాతీయ త్రైపాక్షిక రబ్బర్ కౌన్సిల్ హెచ్చరించింది.

వివిధ దేశాల్లో లాక్‌డౌన్ విధించడంతో రబ్బర్ డిమాండ్ వెంటనే తగ్గిందని, కానీ, ఆ తర్వాత అది అంతే వేగంగా పెరిగిందని మెయెర్ చెప్పారు.

లాక్‌డౌన్ నుంచి బయటపడగానే, ప్రజా రవాణా ఉపయోగించడానికి భయపడ్డ చైనా ప్రజలు, భారీగా కొత్త కార్లు కొనుగోలు చేశారు.

ప్రపంచమంతా అదే తీరు కనిపించింది. దాంతో, రబ్బర్ డిమాండ్‌ సరఫరాను మించిపోయింది.

ఇప్పుడు రబ్బరు ఉత్పత్తి జరిగే ప్రాంతాల్లోనే దీని కొరత ఉంది. దీంతో, టైర్ల తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగిపోతోంది.

అయితే, పెట్రోకెమికల్స్ ద్వారా ఉత్పత్తి చేస్తున్న సింథటిక్ రబ్బరులో సహజ రబ్బరులో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండవు.

సహజ రబ్బరు గ్లోవ్స్.. నైట్రిల్ గ్లోవ్స్‌ కంటే గట్టిగా చిరిగిపోకుండా ఉంటాయి.

విమానాలకు ఉపయోగించే సహజ రబ్బరు టైర్లు, లాండింగ్ సమయంలో రాపిడిని తట్టుకోగలిగేలా, సాగేలా, వేడిని భరించగలిగేలా ఉంటాయి.

రబ్బర్ సేకరణకు వలస కార్మికులు రాలేకపోతుండడం కూడా ఒక సమస్యగా మారింది. దాంతో చాలా రబ్బరు చెట్లు చెక్కకుండా అలాగే మిగిలిపోతున్నాయి.

రబ్బరును మనకు అవసరమైన వస్తువులుగా మార్చే ఫ్యాక్టరీలు గత ఏడాదిలో కొన్ని నెలలపాటు మూతపడ్డాయి.

కానీ, రబ్బరు కొరతకు అతిపెద్ద సమస్య మాత్రం, లోతైన నిర్మాణాత్మక సమస్యలు, వీటిని పరిష్కరించడం అంత సులభం కాదు.

ఇవన్నీ, రబ్బర్ సంక్షోభం నుంచి మనల్ని కాపాడగలిగే అత్యవసర పరిష్కారాలు వెతకడానికి పరిశోధనల స్పీడు పెంచింది.

“మరిన్ని రబ్బరు చెట్లను పెంచడం వల్ల దీనికి ఒక కచ్చితమైన సమాధానం కావచ్చు.

కానీ, ఒకసారి రబ్బర్ కొరత మొదలై, ధరలు పెరగడం జరిగితే.. రబ్బర్ తోటలు పెంపకానికి ఉష్ణమండల అడవుల్లో భూములు సిద్ధం చేయడానకి రైతుల్లో ఉత్సాహం వస్తుంది.

కానీ, రబ్బరు తోటల వల్ల జీవవైవిద్యానికి కూడా నష్టం కలగవచ్చు” అని వారెన్ థామస్ అంటున్నారు.

2011లో చైనాలో రబ్బర్ డిమాండ్ పెరగడం, దాన్ని క్యాష్ చేసుకోడానికి ఆగ్నేయాసియా ప్రభుత్వాలు అటవీ భూముల సాగుకు అనుమతించడంతో అడవులను భారీగా నరికివేశారు.

ఒక్క కంబోడియా విషయానికే వస్తే, అక్కడ మొత్తం అడవుల నరికివేతకు 25 శాతం రబ్బర్ తోటలే కారణం.

పెరగడానికి ఏడేళ్లు పట్టే రబ్బరు చెట్ల నుంచి ఉత్పత్తి ప్రారంభం కావడానికి ఇంకా చాలాకాలం పడుతుంది.

ఇప్పటికే ఉన్న తోటల నుంచి మనం మరింత రబ్బరు తీయడానికి ప్రయత్నించవచ్చు.

ఇండోనేసియాలో దిగుబడి పెంచడానికి భారీ అవకాశాలు ఉన్నాయని అమెరికా, ఒహాయో యూనివర్సిటీ బయోఎమర్జెంట్ మెటీరియల్స్ ప్రొఫెసర్ కత్రినా కార్నిష్ అంటున్నారు.

రబ్బరు ఉత్పత్తి పెంచడానికి, హెవియాకు బదులు, వేరే ప్రత్యామ్నాయాలు చూడాలని సహజ రబ్బరుకు ప్రత్యామ్నాయాలు వెతికే ఒక కార్యక్రమం(PENRA)చేపట్టిన ఓహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కార్నిష్ అంటున్నారు.

వివిధ పరిశ్రమల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో రబ్బరు సంక్షోభాన్ని తప్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రబ్బర్ చెట్లకు ప్రత్యామ్నాయంగా ఉండే మొక్కలను వెతకడంపై పరిశోధనలు జరుగుతున్నాయి.

వీరి పరిశోధనల్లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆసియా రబ్బర్ సరఫరా ప్రమాదంలో పడినప్పుడు రష్యన్లు సాగు చేసిన టారాక్సాకం కోక్-సాఘిజ్ ( Taraxacum kok-saghyz అనే చిన్న కలుపు మొక్క కూడా ఉంది.

కానీ, దానిని రష్యా మొక్క అనకండి, అది కజకిస్తాన్‌ డాండెలియన్ మొక్క.. అలా అంటే వాళ్లకు కూడా చికాగ్గా ఉంది” కార్నిష్ అన్నారు.

ఒక ఎకరా రబ్బరు చెట్ల నుంచి ఎంత ఉత్పత్తి చేయచ్చో, కజకిస్తాన్ డాండెలియన్ మొక్క నుంచి దానికి పది రెట్లు రబ్బరు ఉత్పత్తి చేయచ్చు.

ఈ మొక్కలను తీసి వాటి వేర్లను నలిపి, రబ్బరు తీస్తారు. వీటిని నాటిన మూడు నెలల్లోనే రబ్బరు తీయచ్చు. ఎక్కువ గింజలు కూడా వస్తాయి.

వీటిని నాటడం, రబ్బరు ఉత్పత్తిని పెంచడం చాలా సులభం.

గత ఏడాది జర్మనీ రీసెర్చ్ సంస్థ ఫ్రాన్‌హోఫెర్ ఐఎస్‌సీ ‘బిస్క్‌యా’ అనే ఒక టైర్ ఆవిష్కరించింది. దానిని డాండెలియన్ రబ్బరుతోనే చేశారు.

ఇది సాధారణ రబ్బరు కంటే మన్నికగా ఉంటుందని, మరింత గట్టిదనం ఇస్తుందని ఆ కంపెనీ చెప్పింది.

డాండెలియన్ రబ్బరును వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి రకరకాల పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. డాండెలియన్ వేర్లలో నిండిన రసం ద్వారా ఏడాదిలో ఐదు సార్లు కూడా రబ్బరు తీయొచ్చు.

అమెరికా, మెక్సికో సరిహద్దుల్లోని ఎడారిలో ఒక పొదలా పెరిగే వై-వూలీ(guayule) అనే మొక్క కూడా పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రబ్బర్ కోసం ప్రయత్నించిన అమెరికా ఈ మొక్క నుంచి ఉత్పత్తి చేయాలనుకుంది. రసాయనపరంగా సహజ రబ్బరులాగే ఉండే దీనిలో, రబ్బరు పాల ప్రతిచర్యలకు కారణమయ్యే ప్రొటీన్లు ఉండవు.

ఒక చిన్న శాస్త్రవేత్తల బృందం అత్యవసర రబ్బర్ ప్రాజెక్ట్ కింద, 32 వేల ఎకరాలలో వై-వూలీ సాగు చేశారు. దాన్నుంచి ప్రతి నెలా దాదాపు 400 టన్నుల రబ్బరు ఉత్పత్తి చేశారు.

ఒక పొద నుంచి మొదటి దిగుబడి రావడానికి రెండేళ్లు పట్టింది. అయితే, యుద్ధం ముగిసిపోవడం, తర్వాత చౌకగా దొరికే ఆసియా రబ్బర్ మార్కెట్లోకి రావడంతో ఆ ప్రాజెక్టును ఆపేశారు.

ఇప్పుడు యులిక్స్, టైర్ల కంపెనీ బ్రిడ్జ్‌స్టోన్ మాత్రమే వై-వూలీ పొదల ద్వారా రబ్బరును ఉత్పత్తి చేస్తున్నాయి.

ఈ తాత్కాలిక ప్రయత్నాలను పెంచాల్సిన అవసరం చాలా కీలకం. ప్రపంచ అవసరాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు సంపన్నంగా అవుతుండడంతో సహజ రబ్బరు డిమాండ్ పెరుగుతూనే ఉంది.

రబ్బర్ మార్కెట్లో కార్లు అతిపెద్ద వాటాగా ఉన్నాయి. “ఒక్కో ఆఫ్రికా కుటుంబానికి రెండు కార్లు వస్తే, అప్పటికి, చాలా రబ్బరు వాడేశామనే అనుకోవాలి” అంటారు కార్నిష్.

మార్పు వస్తోందా

బ్రిడ్జ్‌స్టోన్, కాంటినెంటల్, గుడ్‌ఇయర్ సహా రబ్బరు భారీగా కొనుగోలు చేసే చాలా కంపెనీలు ‘గ్లోబల్ ప్లాట్‌ఫాం ఫర్ సస్టైనబుల్ నాచురల్ రబ్బర్‌’లో చేరాయి.

ఇటీవల అడవులు కొట్టివేసిన భూముల్లో వేసిన తోటల నుంచి రబ్బరు కొనుగోలు చేయడాన్ని ఇది నిషేధిస్తుంది.

కాఫీ, కోకోలాగే రబ్బరుకు ఒక నిర్ణీత ధరను ఫిక్స్ చేయాలని మెయెర్ ప్రచారం ప్రారంభించారు.

“సన్నకారు రైతులకు వీలైనంత మంచి జరిగేలా మనం సాయం చేయాలి. ధరలు వారిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి” అని వారెన్ థామస్ అన్నారు.

“దక్షిణ అమెరికాలో ఉన్న ఆకు తెగులు ఆసియాలోకి వస్తే ఎలా అనే ఊహే ఆందోళనకరంగా ఉంటుంది.

దానికి మిగతా వ్యాధులు కూడా తోడైతే.. మనం మొత్తం రబ్బరు చెట్ల జాతినే కోల్పోవచ్చు.

కొన్ని వందల కోట్ల చెట్లు ఒక్క ఏడాదిలోనే చనిపోతే, 40 మిలియన్ టన్నుల రబ్బరు అవసరాలను మనం వెంటనే రీప్లేస్ చేయడం అసాధ్యం” అని కార్నిష్ చెప్పారు..

“ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే రబ్బరులో కనీసం 10 శాతం ప్రత్యామ్నాయ వనరుల నుంచి వచ్చినా.. అత్యవసర పరిస్థితుల్లో, ఒక నియమిత కాలంలో వాటిని త్వరగా పెంచవచ్చు.

ఒక్క ఆరిజోనాలోనే వై-వూలీ పెంచడానికి తగిన 11,600 చదరపు మైళ్ల ఎడారి ప్రాంతం ఉంది.

రబ్బర్ సంక్షోభం లాంటిది తరానికి ఒకేసారి వచ్చేది. ఇలాంటి ప్రత్యామ్నాయాలు పెట్టుబడులను ఆకర్షిస్తాయి”.

“మా దగ్గర దాదాపు వంద ఎకరాల్లో వేయడానికి సరిపోయే, డాండెలియన్ విత్తనాలు ఉన్నాయి.

11 చదరపు మైళ్లలో వేయడానికి అవసరమైన వై-వూలీ విత్తనాలు ఉన్నాయి. కానీ వాటిని సాగు చేయడానికి మాకు నిధులు కావాలి.

కొంతమంది కోటీశ్వరులు దీనికి సాయం చేయాలి. నేను చనిపోయేలోపు దీన్ని స్థాపించాలని అనుకుంటున్నా” అన్నారు.

“మనం త్వరగా పనిలో పడాలి. రబ్బరు తోటలు నాశనమైతే, అభివృద్ధి చెందిన ప్రపంచానికి ఎదురయ్యే పరిణామాలను ఊహించలేం” అంటారు కార్నిష్.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img