– ప్రకటించిన రైల్వే అధికారులు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఇండియన్ రైల్వే కొత్తగా ప్రవేశపెట్టబోతోన్న ‘వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్’ట్రయల్ రన్ విజయవంతమైంది. ముంబయి నుంచి బయలుదేరిన రైలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అహ్మదాబాద్ చేరుకుందని అధికారులు ప్రకటించారు. ఈ ట్రయల్ రన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలువురు రైల్వే ప్రయాణికులు దానిని ఆసక్తిగా చూశారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో పూర్తిగా ఏసీ కోచ్‌లతో కూడిన వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వాటి తరహాలోనే ‘వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్’లను రూపొందించారు. కాకపోతే ఇవి పూర్తిగా నాన్ ఏసీ కోచ్‌లను కలిగి ఉంటాయి. మొత్తం 22 కోచ్‌లతో కూడిన ఈ కొత్త రైళ్లలో స్లీపర్, జనరల్ క్లాసులు ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వీటిలో సీసీటీవీ కెమెరాలు అమర్చారు. పొంచి ఉన్న ప్రమాదాల గురించి ముందుగానే అప్రమత్తం చేసేందుకు భద్రతా సెన్సార్లను ఏర్పాటు చేశారు.
వందే సాధారణ్ రైళ్లకు రెండు చివరల ఇంజిన్లు ఉంటాయి. సిగ్నలింగ్, ట్రాక్‌ల వీలును బట్టి వాటిని వాడుతున్నారు. సుమారు 1,800 మంది ప్రయాణికులు ఈ రైలులో సౌకర్యవంతంగా ప్రయాణం చేయొచ్చు. గరిష్ఠ వేగం 130 కి.మీ కావడంతో 500 కి.మీకు పైగా ఉండే మార్గాల్లో ప్రయాణ సమయం ఆదా అవుతుంది. దేశంలోని పలు ప్రముఖ నగరాల నుంచి ఈ వందే సాధారణ్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. ముంబయి-న్యూఢిల్లీ, పట్నా-న్యూఢిల్లీ, హావ్ డా-న్యూఢిల్లీ, హైదరాబాద్-న్యూఢిల్లీ, ఎర్నాకులం-గువాహటి మార్గాల్లో వాటిని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దశలవారీగా ఈ సర్వీసులను పెంచేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో ‘వందే సాధారణ్’ రైళ్లు రూపుదిద్దుకున్నాయి.