పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు వారాహి విజయభేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభతో జనసేనాని ప్రచారం షురూ కానుంది. మొదటి రోజు శ్రీ పురుహూతిక దేవి అమ్మవారి ఆలచాన్ని దర్శించుకోనున్నారు పవన్.. అక్కడే వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఇక, తన పర్యటనలో భాగంగా తొలిరోజు బషీర్ బీబీ దర్గా దర్శనం, క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనల్లోనూ పాల్గొనబోతున్నారు.. తొలిరోజు సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో వారాహి విజయ యాత్ర పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు పవన్ కల్యాణ్.. తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని వస్తుండడంతో.. ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇక, ఇప్పటికే వారాహి వాహనాన్ని పిఠాపురం నియోజకవర్గానికి తరలించారు. ఈ నెల 30 నుంచి మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్.. కూటమి నేతలతో సమీక్ష నిర్వహిస్తారు.. జనసేనలో చేరికలు కూడా భారీగా ఉంటాయని తెలుస్తోంది.. నియోజకవర్గంలోని మేధావులు, వివిధ వర్గాల నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.. ఈ మూడు రోజులు పవన్ పిఠాపురంలోనే బస చేయనున్నారు. ఈ పర్యటనలో కూటమి నేతల ఇళ్లకు వెళ్లనున్నారు పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పవన్‌కల్యాణ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతున్నారు. మరోవైపు.. వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఆమె కూడా కాపు సామాజికవర్గం నేత కావడంతో తమకు కలిసివస్తుందనే భావనలో వైసీపీ ఉంది.. ఇక, కాపు ఉద్యమ నేత ముద్రగడ ఎం
పద్మనాభం ఇటీవలే వైసీపీలో చేరగా.. ఆయనకు పిఠాపురం బాధ్యతలు అప్పగించారు సీఎం వైఎస్ జగన్.. దీంతో ముద్రగడ వరుసగా పిఠాపురంలో కాపునేతలతో సమావేశాలు అవుతూ వస్తున్నారు.. మొత్తంగా పిఠాపురంలో పోరు ఆసక్తికరంగా సాగుతోంది.