Homeహైదరాబాద్latest Newsఇసుక మాఫియా పై మానేరు పరిరక్షణ సమితి విజయం

ఇసుక మాఫియా పై మానేరు పరిరక్షణ సమితి విజయం


ఇదే నిజం, మంథని : గత ప్రభుత్వం మానేరు నదిలో అనేకచోట్ల డీసిల్టేషన్ పేరిట ఏర్పాటు చేసిన ఇసుక రీచులు పర్యావరణ చట్టాలకు విరుద్ధమని నేడు (మే 21 ) జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్జీటీ) తీర్పును ప్రకటించింది. గత BRS ప్రభుత్వం మానేరు నదిలో చెక్ డ్యాములు నిర్మించకుండానే పూడికతీత పేరుతో కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా పరిధిలో అనేకచోట్ల ఇసుక రీచులు ఏర్పాటు చేసి విధ్వంసానికి పాల్పడింది. మానేరు తీర ప్రాంత రైతాంగం జీవనోపాదులు ఈ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇసుక మాఫియా తో కుమ్మక్కైన గత ప్రభుత్వ పెద్దలు వందల కోట్ల రూపాయలు అక్రమంగా పోగేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానిక రైతాంగ ప్రయోజనాల పరిరక్షణ కోసం కొందరు ఆలోచనా పరులు ఏర్పాటు చేసిన మానేరు పరిరక్షణ సమితి వివిధ పిటిషన్లతో న్యాయ పోరాటాన్ని ప్రారంభించారు. డీసిల్టేషన్ చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఎన్జీటీలో ఐదు పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటన్నిటిని పరిష్కరిస్తూ మంగళవారం ఎన్జీటీ సంచలనమైన తీర్పును వెలువరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా మానేరులో ఏర్పాటుచేసిన ఇసుక రీచ్ లు చట్ట విరుద్ధమని ప్రకటించింది.అంతే కాకుండా అందుకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్ మరియు టిఎస్ఎండిసి విభాగాలు చెరొక 25 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మూడు నెలల్లోగా 50 కోట్ల రూపాయలను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు చెల్లించాలని తీర్పులో పేర్కొంది. అట్టి మొత్తాన్ని రివర్ బోర్డు మానేరు పరిరక్షణకు వినియోగించాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. అంతేకాకుండా మానేరులో అన్ని ఇసుక రీచ్ లను రద్దు చేయించడానికి వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇట్టి తీర్పు అమలు నివేదిక సమీక్షకై కేసును సెప్టెంబర్ 23వ తేదీకి వాయిదా వేసింది.


మానేరు పరిరక్షణ సమితి హర్షం
రెండేళ్ల తమ సుదీర్ఘ న్యాయ పోరాటానికి ముగింపుగా లభించిన విజయం పట్ల మానేరు పరిరక్షణ సమితి నాయకులు హర్షం ప్రకటించారు. ఈ పోరాటంలో భాగమై తమకు అండగా నిలిచిన పర్యావరణ వేత్తలు, మేధావులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్జీటీ పిటిషన్ దారుడు సంది సురేందర్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య రైతునైన తాను అనేక కష్టనష్టాలకు ఓర్చి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా ఎన్జిటిలో న్యాయ పోరాటానికి దిగానని చిన్న రైతు నైన తనకు తల్లి లాంటి మానేరు మాత్రమే జీవనాధారం అని దీని విధ్వంసానికి పాల్పడిన వారిని ఎదుర్కోవడానికి ఎంతో సాహసంతో కృషి చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఎన్జీటీ తీర్పుతో లభించిన విజయం మానేరు తీర ప్రాంతంలో జీవనం కొనసాగించే తనలాంటి సాధారణ రైతాంగానికి అంకితం అని తెలిపారు. గత ప్రభుత్వం మానేరులో విధ్వంసానికి పాల్పడుతూ అనేక అరాచకాలకు తెగ బడిందని, ప్రశ్నిస్తే కేసులతో తనను వేధించారని తెలిపారు. ఇసుక మాఫియా గత ప్రభుత్వంతో కుమ్మక్కై వేలకోట్ల రూపాయలను అక్రమంగా దోచుకుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా, ఎన్జీటీ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన ఇసుక మాఫియా పై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. స్థానిక రైతాంగాన్ని ఆదుకోవడానికి వెంటనే మానేరు నదిలో పటిష్టమైన చెక్ డాముల నిర్మాణాలను పూర్తిచేయాలని కోరారు.
ఎన్జీటీ సహ పిటిషన్ దారుడు మానేరు పరిరక్షణ సమితి నాయకులు చిటికేసి సతీష్ కుమార్ మాట్లాడుతూ త్వరలో మానేరు పరిరక్షణ సమితి నాయకులు, పర్యావరణ ఉద్యమకారులు అందర్నీ సమావేశపరిచి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img