హైదరాబాద్ సమీపంలోని తుర్కయమంజాల్ లో పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర వాయిద్య కళాకారుడు ‘దర్శనం మొగులయ్య’ ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేస్తూ కనిపించారు. ఆయన పొట్టకూటికోసం కూలి పనులకు వెళుతున్నట్టు చెప్పుకొచ్చారు. తనకు గత ప్రభుత్వం ఇస్తున్న 10 వేల రూపాయల నెలవారి గౌరవ వేతనం ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో పూటగడవటం కోసం తాను పని కోసం చాలా చోట్లు ప్రయత్నించానని తనపై సానుభూతి చూపించి మర్యాదపూర్వకంగా తనకు పని ఇవ్వలేదన్నారు. మండుటెండల్లో ఆయన కూలీగా పని చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మొగులయ్యకు వచ్చిన కష్టంపైన, మన దేశంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఉండే ప్రాధాన్యతపైన చర్చ జరుగుతోంది.