– చిక్‌బళ్లాపూర్‌లో కొత్త కేసు నమోదు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. చిక్కబళ్లాపుర్ జిల్లాలో కొత్త కేసు నమోదైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారిలో వంద మంది నుంచి శాంపిళ్లను సేకరించారు. వీటిని పరీక్షించగా ఒకరికి జికా పాజిటివ్ వచ్చింది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి నివాసప్రాంతం చిక్కబళ్లాపుర్ కావడంతో వైద్యవర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆగస్టులోనే ఈ నమూనా పరీక్షలు నిర్వహించగా.. ఆక్టోబరులో వీటి ఫలితాయి వచ్చినట్టు సమాచారం. దీంతో చిక్కబళ్లాపుర్‌లోని దోమలను సేకరించి పరీక్షకు పంపగా.. వాటిలో ఈ వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యాధికారులు ప్రభావితప్రాంతాల్లో హెచ్చరిక జారీ చేశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ముగ్గురి నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. గతేడాది కర్ణాటకలో తొలి జికా కేసు నమోదైంది. రాయచూర్ జిల్లాలో 5 ఏళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. జికా వైరస్‌కు ఏడెస్ దోమ వాహకంగా పనిచేస్తుంది. తొలిసారి ఈ వైరస్‌ను 1947లో ఆఫ్రికా ఖండంలో గుర్తించారు. జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కీళ్లనొప్పులు, కళ్లు ఎర్రగా మారడం, కండరాల నొప్పి దీని లక్షణాలు. మహిళలు గర్భధారణ సమయంలో ఈ వైరస్ బారిన పడితే శిశువులు కొన్ని అవలక్షణాలతో పుట్టే ప్రమాదముంది. అంతేకాకుండా, ఈ వైరస్ ద్వారా మరికొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తేలింది.