Homeఫ్లాష్ ఫ్లాష్పార్టీలకు పోలింగ్ ఏజెంట్లు కావలెను

పార్టీలకు పోలింగ్ ఏజెంట్లు కావలెను

హైదరాబాద్‌: ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏజెంట్లు పాత్ర కీలకం. ముఖ్యంగా ఆయా పార్టీలకు కంచుకోటలైన చోట వీరి పాత్ర మరింతగా ఉంటుంది.

గ్రేటర్‌ పరిధిలో 150 డివిజన్లకు గాను 9,235 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పార్టీలకు 9,235 మంది పోలింగ్‌ ఏజెంట్లు అవసరముంటుంది.

అత్యధికంగా హఫీజ్‌పేటలో 97 పోలింగ్‌ బూత్‌లు ఉండగా, ఆల్విన్‌ కాలనీ, ఓల్డ్‌బోయిన్‌పల్లి, మైలార్‌దేవ్‌పల్లిలో 85 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. మిగతా డివిజన్లలో 45కు పైగా పోలింగ్‌ బూత్‌లున్నాయి.

టీఆర్‌ఎస్‌ 150, బీజేపీ 149, కాంగ్రెస్‌ 146, టీడీపీ 106, ఎంఐఎం 51 డివిజన్లలో పోటీ చేస్తుండగా, ఆయా డివిజన్లలో పార్టీల అభ్యర్థులకు పోలింగ్‌ ఏజెంట్లు ఉండడం వల్ల కొంత మేరకు లాభం చేకూరే అవకాశాలున్నాయి.

పాతబస్తీలోని పలు డివిజన్లలో ప్రధాన పార్టీలకు పోలింగ్‌ ఏజెంట్లు దొరకడం లేదట. కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో జాతీయ పార్టీల అభ్యర్థులకు ఏజెంట్ల కొరత ఉంది.

కొన్ని పార్టీల అభ్యర్థులు మాత్రం ఇంకా ఏజెంట్ల కోసం ఇప్పటికీ వెదుకులాటలోనే ఉన్నారు. ‘పోలింగ్‌ ఏజెంట్లు కావలెను’ అని పలు డివిజన్లలో అభ్యర్థులు బోర్డు పెట్టుకోవడమే తరువాయి.

ప్రధాన పార్టీల పరిస్థితి ఇలా ఉంటే.. స్వతంత్ర అభ్యర్థులకు వారు పోటీ చేసే డివిజన్‌లో, వారు ఓటేసే బూత్‌లో తప్పా.. మరెక్కడా ఏజెంట్లు దొరకని పరిస్థితి నెలకొంది.

పోలింగ్‌ రోజున డివిజన్లలోని ప్రతీ బూత్‌ల్లో అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లకు పాసులిచ్చి అందులోనే కూర్చోపెడుతారు.

ఆ డివిజన్‌లో ఎంత మంది అభ్యర్థులు పోటీ చేస్తే వారికి సంబంధించిన ఏజెంట్లు పోలింగ్‌ బూత్‌లో ఉంటారు. పోలింగ్‌ ఏజెంట్లు తొలుత అనుమతిస్తేనే ఓటర్లను ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, సహాయ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు అనుమతిస్తారు.

ఓటింగ్‌ ప్రక్రియ ముగిసేంత వరకు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు పర్యవేక్షిస్తుంటారు. వీరికి రిలీవర్స్‌ కూడా ఉంటారు.

మధ్యాహ్నం వరకు ఒకరు, ఆ తర్వాత మరొకరు ఏజెంట్‌గా కూర్చోవడానికి ప్రిసైడింగ్‌ అధికారులదే తుది నిర్ణయంగా ఉంటుంది.

ఓట్ల కోసం ప్రచారం చేయడం ఒక ఎత్తైతే ఓటు వేయించడం అత్యంత ప్రధానంగా ఉంటుంది. ఇందులో పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లదే ప్రధాన పాత్ర అంటే నమ్మలేం. అందుకే ప్రధాన పార్టీలు బలమైన తెలివైన ఏజెంట్ల కోసం వెతుకుతున్నారట.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img