– రష్యాకు చెందిన అత్యాధునిక షిప్ ధ్వంసం
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: రష్యా ఆధీనంలోని క్రిమియాలోని కెర్చ్ పోర్ట్ సిటీపై ఉక్రెయిన్ మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. ఒక్కసారిగా 15 మిస్సైల్స్‌ను ప్రయోగించింది. వీటిల్లో 13 మిస్సైల్స్‌ను రష్యా కూల్చేయగా మిగిలినవి లక్ష్యాలను ఛేదించాయి. దీంతో రష్యాకు చెందిన ఓ అత్యాధునిక షిప్ ధ్వంసమైనట్లు సమాచారం. ఈ షిప్లో కిల్బిర్ మిస్సైల్స్ ఉన్నట్లు ఉక్రెయిన్ వాయుసేన కమాండర్ మైకొలా ఒలెస్చుక్ వెల్లడించారు. దాదాపు 20 నెలలుగా చేస్తున్న ఈ యుద్ధంలో రష్యా వందల మిస్సైల్స్‌ను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. ‘మరో నౌక మాస్కోవా బాట పట్టింది’అని మైకొలా ఒలెస్చుక్ వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్‌లో ఉక్రెయిన్ దళాలు చేసిన దాడిలో మాస్కోవా అనే భారీ యుద్ధనౌక మునిగిపోయిన విషయం తెలిసిందే. తాజా దాడిలో రష్యా క్రూజ్ మిసైల్ క్యారియర్ అస్కోల్డ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కొన్ని ఉక్రెయిన్ టెలిగ్రామ్ ఛానల్స్ వెల్లడించాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉక్రెయిన్‌కు చెందిన కొన్ని లక్ష్యాలపై అస్కోల్డ్ దాడులు చేసింది. ఈ నౌకపై కిల్బిర్ మిస్సైల్ సిస్టమ్, పింట్‌సర్ మీడియం రేంజి మిసైల్ వ్యవస్థ, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ శతఘ్ని వ్యవస్థలను అమర్చారు. ఈ నౌక కొన్ని నెలల క్రితమే అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. యుద్ధ నౌకలపై దాడి చేయగల సామర్థ్యం కీవ్‌కు మెరుగుపడటంతో.. రష్యాకు నల్ల సముద్రంలో నిఘా శక్తి గణనీయంగా తగ్గిపోతోందన్నారు. ఫలితంగా ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతికి మార్గం దొరుకుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.