Homeహైదరాబాద్latest NewsWarangal​ ఎంపీ బరిలో అద్దంకి ?

Warangal​ ఎంపీ బరిలో అద్దంకి ?

– అందుకే ఎమ్మెల్సీగా అవకాశం రాలేదా?
– జోరుగా ఊహాగానాలు
– గతంలో తుంగతుర్తి టికెట్ రాకుండా అడ్డుపడ్డ నల్లగొండ నేతలు
– అద్దంకి వరంగల్​ వెళితే అడ్డుచెప్పేవారుండరు
– కాంగ్రెస్​కు ఆ ఎంపీ సీటులో బలమైన లీడర్​ లేరు
– అందుకే అద్దంకి మీద హైకమాండ్​ ఫోకస్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: వరంగల్​ కాంగ్రెస్​ అభ్యర్థిగా అద్దంకి దయాకర్​ పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం వచ్చినట్టే వచ్చి త్రుటిలో తప్పిపోయింది. వరంగల్​ ఎంపీ అభ్యర్థిగా అద్దంకిని దించాలని అధిష్ఠానం ఆలోచిస్తోందని.. అందుకే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తుంగతుర్తి టికెట్ ఆశించారు. అయితే ప్రధానంగా నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్​ కాంగ్రెస్ లీడర్లు అడ్డుపడ్డట్టు వార్తలు వచ్చాయి. కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి పై ఆయన పరుషపదజాలంతో మాట్లాడటంతోనే అప్పట్లో టికెట్​ కు బ్రేకులు పడ్డాయి. ఇక అద్దంకి దయాకర్​కు రేవంత్ వర్గంగా ముద్రపడింది. దీంతో ఆయనకు కీలక పదవి వస్తుందని అంతా భావించారు. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఆయనకు వరంగల్​ ఎంపీ అభ్యర్థిగా అవకాశం రాబోతున్నదని సమాచారం. ఇక్కడ కాంగ్రెస్​ టికెట్​ ను సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య ఆశిస్తున్నారు. రాజయ్య కుటుంబపరమైన ఇబ్బందులతో అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఇక దొమ్మాటి సాంబయ్య వివిధ పార్టీలు మారారు. అయినా ఎన్నికల్లో గెలిచిన ట్రాక్​ రికార్డ్​ లేదు. దీంతో ఈ సారి ఈ స్థానం నుంచి అద్దంకికి సీటు ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

నల్లగొండ నేతల నుంచి లైన్​ క్లియర్​
ప్రస్తుతం అద్దంకి దయాకర్​ నల్లగొండ జిల్లా నేతల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయనకు గతంలో ఎమ్మెల్యే టికెట్ రాకుండా వారే అడ్డుపడ్డారు. ప్రస్తుతం అద్దంకి జిల్లా మారితే ఈ సమస్య ఉండదు. నల్లగొండ జిల్లా నేతలు జోక్యం చేసుకోరు. ఇక దీనికి తోడు వరంగల్​ జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ బలంగా ఉంది. వరంగల్​ పార్లమెంటు పరిధిలోని స్టేషన్​ ఘన్​ పూర్​ మినహా మిగిలిన అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్​ పార్టీ విజయం సాధించింది. దీంతో ఎంపీ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీదే నడకేనని కాంగ్రెస్​ పార్టీ భావిస్తోంది. అయితే బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్​ వెయిట్ చేస్తుండగా.. తాజాగా అద్దంకి దయాకర్​ అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. ఇక వరంగల్​ పార్లమెంటు నుంచి బీజేపీ, బీఆర్ఎస్​ కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తోంది. బీజేపీ నుంచి మందకృష్ణ బరిలో దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఇక బీఆర్ఎస్​ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించే చాన్స్​ ఉంది. దీంతో కాంగ్రెస్​ పార్టీ అద్దంకిని ఎంపిక చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల్లో అద్దంకిని బరిలో దించాలని మరో ఆలోచన కూడా కాంగ్రెస్​ చేస్తున్నట్టు సమాచారం. మరి అద్దంకికి వరంగల్​ ఎంపీ టికెట్​ వస్తుందా? ఆయన గెలుస్తారా? అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img