Homeజాతీయంమా విధానాలతో చమురు ధరలను కట్టడి చేశాం

మా విధానాలతో చమురు ధరలను కట్టడి చేశాం

– ఈ విషయంలో మిగతా దేశాలు భారత్​ కృతజ్ఞతలు చెప్పాలి
– కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో భారత్‌ తన కొనుగోలు విధానాల ద్వారా చమురు, గ్యాస్‌ ధరలు పెరగకుండా అంతర్జాతీయ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించగలిగిందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్ అన్నారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్‌లో పర్యటిస్తున్న ఆయన లండన్‌లో భారత హైకమిషన్‌ కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చమురు ధరలు కట్టడి చేసినందుకు మిగిలిన దేశాలు భారత్‌కు కృతజ్ఞతలు చెప్పాలని వ్యాఖ్యానించారు. ‘భారత కొనుగోలు విధానాల ద్వారా అంతర్జాతీయ చమురు, ఇంధన మార్కెట్లు ధర ఒడిదొడుకులకు గురికాకుండా చేసింది. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చూసేందుకు ఇది ఉపయోగపడింది. అందుకు భారత్‌కు ప్రపంచ దేశాలు కృతజ్ఞతలు చెప్పాలి. దాని కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఒకవేళ రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయకుంటే.. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు విక్రేతల వద్దకే మేము కూడా వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు చమురు ధరలు ఊహించనంతగా పెరిగేవి. ఫలితంగా అదే ధరలకు ఐరోపా కూడా చమురు కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో ఎల్‌పీజీ మార్కెట్లలో ఆసియాకు రావాల్సిన పెద్ద సరఫరాదారులు యూరప్‌కు తరలిపోయారు. కొన్ని చిన్న దేశాలు ఎల్‌పీజీ ఇంధన కొనుగోలు కోసం దాఖలు చేసిన టెండర్లపై స్పందించేందుకు కూడా సరఫరాదారులు ఆసక్తి చూపలేదు. అదే సమయంలో రష్యాతో భారత్‌ తమ బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది’అని జైశంకర్ వ్యాఖ్యానించారు.


ఆధారాలుంటే భారత్‌కు ఇవ్వండి


కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాద నాయకుడు హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలపై జైశంకర్ స్పందించారు. భారత్‌పై చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలను కెనడా తమతో పంచుకోలేదన్నారు. ‘కెనడా అధికారులకు ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశాం. వారు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏవైనా ఆధారాలుంటే భారత్‌తో పంచుకోవాలని కోరాం. దీనికి సంబంధించి దర్యాప్తును మేము తిరస్కరించడం లేదు. భావప్రకటనా స్వేచ్ఛ అనేది బాధ్యతతో కూడుకున్నది. రాజకీయాల కోసం దాన్ని దుర్వినియోగం చేయడం చాలా తప్పు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే హింసాత్మక, రాజకీయవాదులకు కెనడా తన రాజకీయాల్లో చోటు కల్పించింది’అని జైశంకర్ అన్నారు.

Recent

- Advertisment -spot_img