– ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ
– మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో ఎన్నికల ప్రచారం
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ను భవిష్యత్లో మ్యూజియంలో చూస్తారని ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొరూరు డివిజన్ కేంద్రంలో పాలకుర్తి సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో ఎవరి భాగస్వామ్యం లేకున్నా ప్రజల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. పదేళ్లలో ఒక్క హైదరాబాద్లో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. యువకులను ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ అవినీతికి పాల్పడిందని, పేపర్లు అమ్ముకున్నారన్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడికి మాత్రమే ఉపాధి దొరికిందన్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కోరుకున్నది ప్రజల తెలంగాణా అని ప్రియాంక తెలిపారు. ఫాం హౌస్ తెలంగాణ కాదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలకు టాటా బాయ్ బాయ్ చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రియాంక తెలిపారు.