– తెలంగాణ డబ్బులతోనే ప్రాజెక్టులు కట్టుకుంటాం
– కృష్ణానదిలో నీటి వాటా మాత్రం తేల్చాలి
– మంత్రి శ్రీనివాసగౌడ్
ఇదేనిజం, హైదరాబాద్: ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకొని పాలమూరుకు వస్తున్నారని మంత్రి శ్రీనివాసగౌడ్ ఆరోపించారు. తెలంగాణ డబ్బులతోనే ప్రాజెక్టులు కట్టుకుంటామని.. కానీ కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల 1న(రేపు) పాలమూరు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.
కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం శ్రీనివాసగౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరుకు లక్ష లేదా 50 వేల కోట్ల ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ గతంలో ఏ వేదిక మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా హామీ ఇచ్చి మరిచారో అదే వేదిక మీదకు ఏం ఉద్దరిద్దామని వస్తున్నారని నిలదీశారు. తెలంగాణను అవమానించిన మోడీకి ఇక్కడేమి పని అని ప్రశ్నించారు. మోడీ పాలమూరుకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.