పాస్‌పోర్టు.. విదేశాలకు వెళ్లేందుకు ఇది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. భారతీయుల విషయానికి వస్తే.. ఇది మీరు భారతీయుడని విదేశీ అధికారులు గుర్తించే అధికారిక పత్రం. విదేశాల్లో ఉన్న సమయంలో అనుకొని పరిస్థితుల్లో పాస్‌పోర్టు పోగొట్టుకోవడం గానీ, దొంగిలించబడటం గానీ జరిగితే ఏం చేయాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది.. ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరు తిరిగి సేఫ్‌గా ఇండియాకు తిరిగి రావొచ్చు.. అదేలాగో తెలుసుకుందాం..
పోలీసులకు ఫిర్యాదు చేయాలి..
పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడం లేదా దొంగిలించబడటం జరిగితే.. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఈ ఫిర్యాదుకు సంబంధించిన నివేదిక కాపీని కూడా తీసుకోవాలి.. ఎందుకంటే ఇది మీరు పాస్‌పోర్ట్ కోల్పోయినట్లుగా తెలిపే రుజువుగా పనిచేస్తుంది. కొత్త పాస్‌పోర్ట్ లేదా ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసేందుకు ఇది అవసరం అవుతుంది.
సమీపంలోని ఇండియన్ ఎంబసీని సంప్రదించాలి..
పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత సమీపంలోని భారతీయ రాయబార కార్యాలయంను సంప్రదించాలి. విదేశాల్లో ఇరుక్కుపోయిన లేదా పాస్‌పోర్ట్ పోయినా ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్న పౌరులకు సహాయం చేయడానికి విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలు ఉన్న సంగతి తెలిసిందే. మీరు పాస్‌పోర్టు కోల్పోయిన విషయం వారికి తెలియజేసి.. సాయం కోరవచ్చు.
రెండు ఎంపికలు..
విదేశాల్లో ఉండి పాస్‌పోర్టు కోల్పోయిన వ్యక్తులకు.. రెండు ఎంపికలు ఉంటాయి. మరొక పాస్‌పోర్ట్ కోసం గానీ.. ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు మరొక పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే.. మీరు ఏడు రోజులు వేచి ఉండాలి. ఆ తర్వాత మీరు కొత్త పాస్‌పోర్ట్ పొందుతారు. అయితే మీరు వెంటనే ఇండియాకు చేరుకోవాలని భావిస్తే ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే డూప్లికేట్ పాస్‌పోర్ట్‌లు జారీ చేయబడవు. అలాగే కొత్తగా జారీ అయ్యే పాస్‌పోర్ట్.. కొత్త నెంబర్‌తో పాటు, వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.