పరిహారమేది?
- బాధితుల గోడు పట్టదా?
- పంక్షన్ హాల్ లో అన్నం పెడతారా?
- వరద సాయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం
- మాటలకే పరిమితమైన సాయం
- బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఫైర్
ఇదేనిజం, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లో పర్యటించారు. వర్షాలకు తెగిన రోడ్లు, బ్రిడ్జి, కల్వర్టులను ఈటల పరిశీలించారు. జమ్మికుంట హౌసింగ్ బోర్డు, అంబేద్కర్ కాలనీల్లో ఇండ్లు నీట మునిగిన బాధితులను పరమార్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఇండ్లు నీట మునిగిన బాధితుల పట్ల ప్రభుత్వ స్పందన కరువని విమర్శించారు. బాధితులను ఫంక్షన్ హాల్లో పెట్టి అన్నం పెట్టారని.. పరిహారానికి మాత్రం దిక్కు లేదన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 వేలు ఆందజేయాలని డిమాండ్ చేశారు. తెగిన రోడ్లు, చెరువులు, కల్వల ప్రాజెక్ట్ మరమ్మత్తులు చేపట్టాలన్నారు. చెరువుల కింద ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయన్నారు. ప్రభుత్వం మాటలు గొప్పగా ఉంటాయని.. కానీ చేతల్లో మాత్రం ఏమీ చెయ్యరని ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.