గ్లియోబ్లాస్టోమా అనేది మెదడులోని ఆస్ట్రోసైట్లు అనే కణాల్లో తలెత్తుతుంటుంది. సాధారణంగా.. మెదడులోని అతిపెద్ద భాగమైన సెరిబ్రమ్‌లో ఇది పుట్టుకొస్తుంది. గ్లియోబ్లాస్టోమా కణితులు తమ సొంత రక్త సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటాయి. ఫలితంగా వేగంగా ఎదుగుతాయి. ఈ క్యాన్సర్ వ్యాప్తిలో వేగం కారణంగా మెదడుపై త్వరగా ఒత్తిడి పడుతుంది. ఫలితంగా తీవ్ర తలనొప్పి, మూర్ఛ, వాంతులు, ఆలోచన శక్తి మందగించడం, భావోద్వేగాల్లో మార్పులు, ఒక వస్తువు రెండుగా కనిపిస్తుంది.
మెదడు క్యాన్సర్‌పై కీలక పరిశోధన
అమెరికా శాస్త్రవేత్తలు గ్లియోబ్లాస్టోమాపై పరిశోధన చేశారు. ప్రధానంగా బీఆర్‌డీ8, పీ53 ప్రొటీన్లపై దృష్టిపెట్టారు. పీ53 అనేది శరీరంలోని సహజసిద్ధ క్యాన్సర్ రక్షణ కవచం. ఈ ప్రొటీన్ నిర్వీర్యం కావడం వల్లే క్యాన్సర్లు తలెత్తుతున్నాయి. అయితే మెజార్టీ కేసుల్లో పీ53 చెక్కుచెదరడంలేదు. అయినా ఈ క్యాన్సర్ ఎలా వ్యాప్తి చెందుతోందన్నది ఏళ్లుగా అంతుచిక్కకుండా ఉంది. మిల్స్ బృందం బీఆర్‌డీ8 కట్టుతప్పి వ్యవహరిస్తోందని గమనించింది.