లగచర్లలో అర్థరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండే కాదు.. పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా అని
బీర్ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోంది ? వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోంది అని ఆరోపించారు. సీఎం సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి ? అని ప్రశ్నించారు. కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా..లేక లగచర్ల.. చైనా బార్డర్లో ఉన్న కల్లోలిత ప్రాంతమా అని అన్నారు. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారు అని నిలదీశారు. కొడంగల్ కు వెళ్లే అన్ని దారుల్లో పోలీసుల పహారా ఏర్పాటుచేశారు అని అన్నారు. మీరెంత దాచే ప్రయత్నం చేసినా.. నిజం దాగదు.. ఇప్పటికే లగచర్లలో కాంగ్రెస్ సర్కారు కిరాతకం ఢిల్లీకి చేరింది అని తెలిపారు. దేశ రాజధానిలో మీ అరాచకపర్వంపైనే తీవ్ర చర్చ జరుగుతోంది అని తెలిపారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే.. కాంగ్రెస్ సర్కారు తప్పుచేసినట్టు ఒప్పుకున్నట్టే లెక్క.. అని ప్రశ్నించారు. మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పాలి అని.. లగచర్లలో నిర్బంధాన్ని ఎత్తివేసి.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్ చేసారు.