Homeహైదరాబాద్latest Newsఇదేమి పాలన.. ఇదేమి చోద్యం.. ముఖ్యమంత్రికి తెలియకుండా నిర్ణయాలా?

ఇదేమి పాలన.. ఇదేమి చోద్యం.. ముఖ్యమంత్రికి తెలియకుండా నిర్ణయాలా?

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. మంత్రులకు మధ్య సమన్వయం ఉందా? అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. శనివారం రోజున హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ అక్రమ నిర్మాణమంటూ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చి వేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనమైంది. ఇదిలా ఉంటే ఈ ఘటన ముఖ్యమంత్రికి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు తెలియకుండా జరిగిందట. దక్షిణతెలంగాణకు చెందిన ఓ మంత్రి ఆదేశాల మేరకు అధికారులు వ్యవహరించాట. ఈ కూల్చివేత అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారటంతో.. ఉన్నతాధికారులు ఎంట్రీ ఇచ్చారు. జగన్ ఇంటి ముందు ఉన్న నిర్మాణాల కూల్చివేతపై జీహెచ్ఎంసీ ఇన్ చార్జ్ కమిషనర్ ఆమ్రపాలి సీరియస్ అయినట్టు సమాచారం. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే‌పై ఆమ్రపాలి చర్యలకు ఉపక్రమించారు. హేమంత్ బోర్కడే‌పై బదిలీ వేటు వేయగా.. జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అయితే ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత జరిగిందా?
సహజంగా రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట అక్రమ నిర్మాణాల కూల్చివేత జరిగితే అది ముఖ్యమంత్రికి తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ హైదరాబాద్ నడిబొడ్డున అది కూడా ఓ మాజీ ముఖ్యమంత్రి, ఓ పార్టీకి అధినేతగా ఉన్న జగన్ ఇంటి కూల్చివేత వ్యవహారం సీఎం దృష్టికి రాకపోవడం ఏమిటని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ దశలో చంద్రబాబు ఆదేశాల మేరకే రేవంత్ జగన్ ఇంటి వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేశారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎంత అధ్వాన్నంగా ఉందో.. మంత్రులు, ముఖ్యమంత్రి మధ్య ఏ స్థాయిలో సమన్వయం ఉందో ఈ ఘటనను చూస్తే అర్థమవుతోందన్న చర్చ నడుస్తోంది.

ఎవరికివారే యమునా తీరే..
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అటు మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు ఆయా జిల్లాల్లోకి వెళ్లి సొంతంగా నిర్ణయాలు ప్రకటించేస్తున్నారు. ఇక పార్లమెంటు ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ కు కొంత అడ్మినిస్ట్రేషన్ విషయంలో పట్టు తగ్గిందా? అన్న డిస్కషన్ కూడా మొదలైంది. అంతకుముందు వరకు ముఖ్యమంత్రి చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్నట్టుగా పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం పాలమూరు, మల్కాజ్ గిరి, చేవెళ్ల ఈ మూడు సెగ్మెంట్లను సీఎం గెలిపించలేపోవడంతో పెద్దగా ఆయన మాట చెల్లుబాటు కాకుండా పోయిందని.. అధిష్ఠానం దగ్గర కూడా పలుకుబడి తగ్గిపోయిందన్న చర్చ నడుస్తోంది. మొత్తానికి లోటస్ పాండ్ కూల్చివేత ఘటన కొంత చర్చకు దారి తీసింది.

Recent

- Advertisment -spot_img