- రేవంత్ అపర చాణక్యం.. జీవన్ రెడ్డికి మరణశాసనం
- సీనియర్ నేతకు రాజకీయంగా చావు దెబ్బ
- బయటకు పోలేడు.. పార్టీలో ఉండలేడు
- కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడికి వల
- సంజయ్ జంపింగ్ తో ఇతర లీడర్లకు రూట్ క్లియర్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందరికీ షాక్ ఇచ్చాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంతో ఆ పార్టీ కేడర్, ప్రజలు పెద్దగా ఆశ్చర్యపోలేదు కానీ సంజయ్ జంపింగ్ తో అంతా ముక్కున వేలేసుకున్నారు. చాలా మంది కార్యకర్తలు తాము ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని పోస్టులు పెడుతున్నారు. ఇక సంజయ్ ను చేర్చుకొని సీఎం రేవంత్ రెడ్డి అపరచాణక్యం ప్రదర్శించారు. ఒక్క దెబ్బతో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజకీయ జీవితం సమాధి కాగా.. ఒక్కసారిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాక్కు గురై అయోమయంలో పడిపోయారు. కేసీఆర్ సొంత సామాజికవర్గం నేతను చేర్చుకోవడం ద్వారా తాను ఏ ఎమ్మెల్యేనైనా లాక్కొగలను అన్న బలమైన సంకేతాన్ని రేవంత్ రెడ్డి .. బీఆర్ఎస్ శిబిరంలోకి పంపగలిగారు.
జీవన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి..
జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. బలమైన వాయిస్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసిన నేతల్లో జీవన్ రెడ్డి కూడా ఒకరు. ఓ దశలో పీసీసీ చీఫ్ పదవికికూడా గట్టిగా పోటీ పడ్డారు. అటువంటి నేత రాజకీయ భవితవ్యం ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయింది. జీవన్ రెడ్డిని జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్ కుమార్ వరసగా రెండు సార్లు ఓడించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనక.. జగిత్యాల సెగ్మెంట్ లో ఆయనే హీరో. కానీ అటువంటి చోట తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే జీవన్ రెడ్డికి.. ఆయన అనుచరులకు విలువ ఏమీ ఉండదు. అందుకే జీవన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు..
జీవన్ రెడ్డి 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. ఆ వెంటనే జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తన పట్టు నిలుపుకున్నారు. అయితే ప్రస్తుతం తాను గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది కనక జీవన్ రెడ్డి నియోజకవర్గంలో అంతో ఇంతో చక్రం తిప్పగలుగుతున్నారు. కానీ ఇప్పుడు సంజయ్ వస్తే జీవన్ రెడ్డి జీరో అయిపోతారు. అటు సంజయ్ తో కలిసి పార్టీలో ఉండలేరు.. అలాగని ఈ వయసులో పార్టీ మారనూ లేరు. మరోవైపు అధిష్ఠానం వద్ద మొరపెట్టుకున్న ఆలకించే పరిస్థితి లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ను దెబ్బ తీసేందుకు అతడికి సన్నిహితుడైన వ్యక్తిని పార్టీని చేర్చుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే అంశమే. మొత్తం జీవన్ రెడ్డి రాజకీయ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చుకోవడం రేవంత్ రెడ్డికి రెండు విధాలా ఉపయోగపడుతోంది. ఇటు పార్టీలో ఎంతటి సీనియర్ లీడర్ కైనా తాను చెక్ పెట్టగలనన్న సంకేతాలు రేవంత్ పంపగలిగారు. మీకు అత్యంత సన్నిహితులను, ఇంటి మనుషులకు భావించే వాళ్లను కూడా రాత్రికి రాత్రే లాగి పారేయగలను అంటూ అటు ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ కు బలమైన సంకేతాలు పంపగలిగారు రేవంత్. ఇలా ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారో .. ఎటువంటి ఆశ్చర్యకరమైన వార్తలు వినాల్సి వస్తుందో వేచి చూడాలి.